BRS IN AP: భారత్ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దమయింది. భారత్ రాష్ట్రసమితి జాతీయ పార్టీగా మారాలంటే దానికి నాలుగు రాష్ట్రాల్లో కనీస ఓట్లు రావలసి ఉంటుంది. దీనితో ముందుగా మరో తెలుగు రాష్ట్రం ఏపీపై కేసీఆర్ దృష్టి సారించారు. అమరావతిలో తొలిసారిగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సమావేశాన్ని ఆయన నిర్వహించనున్నారు. అమరావతిలో కూడా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలోవివిధ జాతీయ రాజకీయ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత మంత్రి శ్రీనివాసయాదవ్ కు ఏపీ పార్టీ వ్యవహారాలను అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. తలసానికి ఏపీలోని పలు పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన గతంలో టీడీపీ లో సుదీర్ఘకాలం ఉన్నారు.అందువలన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న అసంతృప్తులను బీఆర్ఎస్ లోకి తీసుకువస్తారని భావిస్తున్నారు, మరోవైపు ప్రస్తుత పార్టీల్లో ఇమడలేక దూరంగా ఉన్న అయిదుగురు నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు కూడ తెలుస్తోంది.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి కేసీఆర్ తనవంతు సహాయ సహకారాలు అందించారు. జగన్ సీఎం అయ్యాక కూడ ఇరువురి మధ్య మంచి సంబంధాలే కొనసాగుతూ వస్తున్నాయి. నదీజలాల వివాదాలు, కరెంటు బకాయిలు వంటి వాటిపై ఇద్దరు సీఎంలు బహిరంగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. కేసీఆర్ లా కాకుండా తాను ఏపీకే పరిమతమవుతానని జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గత మూడున్నరేళ్లుగా ఆయన బీజేపీ నేతలతో ఎటువంటి పంచాయతీ పెట్టుకోలేదు. ఈ సమయంలో కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి ఎంటరయితే జగన్ వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇస్తున్నట్లు తెలియగానే వైసీపీ నేత సజ్జల స్పందించారు. ఇతర పార్టీల్లాగే బీఆర్ఎస్ కు ఏపీలో ఎంట్రీ ఇచ్చేందుకు, రాజకీయాలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
మంత్రి తలసాని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో టచ్‌లో ఉన్నారనే వార్తలు ఇపుడు ఆసక్తికరంగా మారాయి. కాగా, వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ వెల్లడించారు. విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పారు. అయితే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. దీనికి సంబంధించి.. ఇప్పటికే లక్ష్మీనారాయణతో ఆప్ అధినాయకత్వం చర్చలు జరుపుతుండగా.. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా తెరపైకి రావడంతో.. ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది.