Site icon Prime9

Wrestlers Protest: కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన రెజ్లర్లు

Wrestler

Wrestler

Wrestlers Protest: భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన భారత స్టార్ రెజ్లర్లు శనివారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయితేనే ఈ ఏడాది జరగబోయే ఏషియన్‌ గేమ్స్‌ లో పాల్గొంటామని.. లేదంటే వాటిని బహిష్కరిస్తామని హెచ్చరించారు.

 

పరిష్కారమైతేనే ఏషియన్ గేమ్స్ లో(Wrestlers Protest)

హర్యానాలోని సోనిపట్‌లో శనివారం ఖాప్‌ నేతలు నిర్వహించిన మహా పంచాయత్‌లో రెజ్లర్లు సాక్షి మలిక్‌ , బజరంగ్‌ పునియా పాల్గొన్నారు. ‘ఈ సమస్యలన్నీ పరిష్కారమైతేనే మేం ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొంటాం. ప్రతిరోజూ మానసికంగా ఎంతటి వేదన అనుభవిస్తున్నామో మీకు అర్థం కాదు’ అని సాక్షిమాలిక్ అన్నారు. ప్రభుత్వంలో జరిగిన చర్చల గురించి ఖాప్‌ నేతలకు వివరించనున్నట్టు తెలిపారు. ఆందోళన చేస్తున్న రెజ్లర్ల మధ్య యూనిటీ లేదని వస్తున్న వార్తలను సాక్షి మాలిక్ కొట్టిపారేశారు. తామంతా ఒక్కటే అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ అందరం ఆందోళనకు దిగుతామన్నారు.

 

బ్రిజ్ భూషణ్ ఇంటి వద్ద సీన్ రీక్రియేషన్(Wrestlers Protest)

తాజాగా క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రెజ్లర్లతో చర్చలు జరిపారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఈ నెల 15 లోగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని.. జూన్‌ 30 లోగా డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో రెజ్లర్లు తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఇదిలా ఉండగా.. రెజ్లర్ల ఫిర్యాదుతో బ్రిజ్‌ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వాటిపై సిట్ విచారణ జరుపుతోంది. ఇప్పటి వరకు 180 మందిని విచారించారు. ఇందులో భాగంగానే శుక్రవారం బ్రిజ్ భూషణ్ ఇంటి దగ్గరకు ఓ మహిళా రెజ్లర్‌ను తీసుకెళ్లి సీన్‌ రీక్రియేషన్ చేయించారు. ఈ కేసులో త్వరలోనే సిట్‌ బృందం దర్యాప్తు రిపోర్టును కోర్టుకు సమర్పించనుంది.

Exit mobile version