Uttarkashi Tunnel Rescue: 17 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులకు శుభంకార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో నిర్వీరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రార్థనలు ఫలించి, ఎట్టకేలకు ఉత్తరకాశీ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. నిర్మాణం దశలో ఉన్న సొరంగం ప్రమాదవశాత్తూ కూలడంతో.. 17 రోజులపాటు భూగర్భ బందీలుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులు ప్రాణాలతో బయటకొచ్చారు. రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా కాపాడాయి. స్ట్రెచర్ సహాయంతో ఒకరి తర్వాత మరొకరిని బయటకి తీసుకొచ్చారు.
‘ర్యాట్ హోల్ మైనింగ్’ టెక్నిక్(Uttarkashi Tunnel Rescue)
ఈ ఆపరేషన్‌లో భాగంగా రెస్క్యూ బృందాలు చేపట్టిన ‘ర్యాట్ హోల్ మైనింగ్’ టెక్నిక్.. ఈ రెస్క్యూ విజయవంతం అవ్వడానికి కారణమైంది. అత్యాధునిక మెషిన్లు, ఆగర్లు విఫలమైన చోట.. నిపుణుల సలహాతో ప్రారంభించిన ఈ ‘ర్యాట్ హోల్ మైనింగ్’ వేగంగానే కార్మికులను చేరుకుంది. డ్రిల్లింగ్ తర్వాత పైపింగ్ చేశారు. అనంతరం స్ట్రెచర్ ద్వారా కార్మికులను బయటకు తీసుకురావడం జరిగింది. ఈ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల్లో ఎక్కువ మంది జార్ఖండ్ వాసులే. 41 మందిలో 15 మంది కూలీలు జార్ఖండ్‌కు చెందిన వారు కాగా.. ఏడుగురు ఉత్తరప్రదేశ్, 5 మంది బీహార్, 5 మంది ఒడిశా, ముగ్గురు పశ్చిమ బెంగాల్, ముగ్గురు ఉత్తరాఖండ్, ఇద్దరు అస్సాం, హిమాచల్ ప్రదేశ్ నుండి ఒకరు ఉన్నారు. ఈ సొరంగంలో నుంచి బయటకు వచ్చిన కూలీలను ఉత్తరాఖండ్‌లోని చిన్యాలిసౌర్ ఆసుపత్రికి తరలించారు. వాళ్లు ఆరోగ్యంగానే ఉన్నారా? లేదా? అనేది పరీక్షించి.. తదగిన వైద్య సలహాలు ఇచ్చి.. ఇంటికి పంపనున్నారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమాయ్ సొరంగం నుండి బయటకు వచ్చిన కార్మికులను కలుసుకున్నారు. 41 మంది కార్మికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం ధామి ప్రకటించారు. ఈ మేరకు వారికి చెక్కులను అందజేసారు. ఆసుపత్రి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని కూడా చెప్పారు. ఉత్తరకాశీ సొరంగం నుంచి తరలించిన కార్మికులతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పోన్లో మాట్లాడి పరామర్శించారు.