Bengal Panchayat Polls: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం అల్లర్లతో అతలాకుతలం అయ్యింది. రోడ్లన్నీ రక్తసిక్తంగా మారాయి. ఎన్నికల్లో తీవ్ర హింస చెలరేగింది. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో అధికార విపక్షాలకు మధ్య పలు జిల్లాలో రాజకీయ కక్షలు పెరిగాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీ, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, వామపక్ష పార్టీల మధ్య ఎక్కడో ఓ దగ్గర ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. నడిరోడ్లపైనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. శనివారం ఎన్నికల పోలింగ్ రోజు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కాగా పలు పార్టీల కార్యకర్తలు ఆ హింసల్లో మరణించారు. అలాగే ఓటింగ్ ముగిసిన తర్వాత పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బ్యాలెట్ బాక్సుల్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. అనేక గ్రామాల్లో ప్రత్యర్థులపై బాంబు దాడులు జరిగాయి. పలువురికి గాయాలయ్యాయి.
ఎన్నికల తర్వాత రోజు కూడా దాడులు కొనసాగాయి. ఈ రోజు మాల్డాలో టీఎంసీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు హత్యచేయబడ్డారు. దీనితో ఎన్నికలకు సంబంధించి జరిగిన హింసలో ఇప్పటి వరకు దాదాపు 20 మంది మరణించారు. మృతుల్లో ఒకరైన టీఎంసీ కార్యకర్త మాటియుర్ రెహ్మన్ పోలింగ్ స్టేషన్ కి వచ్చిన సమయంలో కొంతమంది దుండగులు చుట్టుముట్టి అతన్ని కత్తితో పొడిచి చంపారు. ఈ హత్యకు కాంగ్రెస్ కారణమని అధికార టీఎంసీ ఆరోపించింది. అలాగే మరో టీఎంసీ కార్యకర్త అజహర్ లష్కర్ పై బసంతిలో దాడి జరిగింది. టీఎంసీ, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన దాడిలో అతను మరణించాడు. కాగా ఈ ఘర్షణలో మరికొందరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇకపోతే అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య ఈ దాడుల వ్యవహారమై మాటల యుద్ధం నడుస్తోంది. బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని.. అనేక పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగినా కూడా ఇంత రక్తపాతం జరిగడం విషాదకరం. గత నెల ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 30 మంది వరకు మరణించారు. మరి ఈ హింస ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.