Karnataka MLA: కర్ణాటకలో లంచం కేసు.. కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే తనయుడిపై కేసు నమోదు చేయగా.. ఇప్పుడు ఈ కేసులో భాజపా ఎమ్మెల్యే.. నిందితుడి తండ్రిని ఏ1 ముద్దాయిగా కేసులో చేర్చారు. ఎమ్మెల్యే పాత్రపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు.
ఏ1 నిందితుడిగా భాజపా ఎమ్మెల్యే.. (Karnataka MLA)
కర్ణాటక లంచం కేసు.. ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే భాజపా ఎమ్మెల్యే కుమారుడితో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. దీంతో ఎమ్మెల్యే పాత్రపైనా పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. భాజపా తనయుడి ఇంట్లో సుమారు రూ.8కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్పను ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు తెలుస్తోంది. లోకాయుక్త అధికారుల సమాచారం మేరకు.. ఎమ్మెల్యే తరపునే ఆయన కుమారుడు లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎమ్మెల్యే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆచూకీ లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
చెన్నగిరి శాసనసభ్యుడు విరూపాక్షప్ప కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన తనయుడు ప్రశాంత్ మదాల్ బెంగళూరులోని జలమండలిలో చీఫ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఓ టెండర్ విషయంలో రూ.81 లక్షలు ఇవ్వాలని ప్రశాంత్ డిమాండ్ చేశారని ఆరోపణ ఉంది. ఈ క్రమంలో బాధితుడు కర్ణాటక లోకాయుక్తాను ఆశ్రయించాడు. దీంతో వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుత్తేదారు నుంచి తీసుకున్న లంచంతో సహా.. మొత్తం రూ.2.02కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల అనంతరం ప్రశాంత్ ఇంటిపైనా సోదాలు నిర్వహించారు. ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. సుమారు రూ.8కోట్ల గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఛైర్మన్ పదవికి రాజీనామా..
లంచం కేసులో కుమారుడు చిక్కుకోవడంతో విరూపాక్షప్ప కేఎస్‌డీఎల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంపై ఆయన స్పందించారు. తన కుటుంబంపై కావాలనే కొందరు కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం బొమ్మై.. దీనిపై లోకాయుక్త స్వతంత్ర దర్యాప్తు జరుపుతుందని చెప్పారు. లంచం తీసుకుంటూ లోకాయుక్తకు చిక్కిన భాజపా ఎమ్మెల్యే కుమారుడు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ‘40శాతం’ పేరుతో సామాన్యుడిని బొమ్మై ప్రభుత్వం దోచుకుంటోందంటూ ఆరోపించింది. కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. కర్ణాటకలో ప్రస్తుతం భాజపా అధికారంలో ఉంది. ఇప్పటికే సీఎంతో సహీ అక్కడి నేతలపై.. తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ ఘటన భాజపాను ఇరకాటంలో పడేసింది. కుమారుడు లంచం కేసులో చిక్కుకోవడంతో ఎమ్మెల్యే విరూపాక్షప్ప కేఎస్‌డీఎల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తీవ్ర విమర్శలు రావడంతో.. ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు.