Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో.. భాజపా పై విమర్శలు చేసిన సోనియా గాంధీ.. రాజకీయాల నుంచి విరమణపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
భాజపాపై సోనియా సంచలన వ్యాఖ్యలు..
ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. రెండో రోజు శనివారం.. కాంగ్రెస్ అగ్రనేతలు కీలక ప్రసంగాలు చేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాక గాంధీ సహా అగ్రనేతలు ఇందులో పాల్గొన్నారు.ఇక ఈ సమావేశాల్లో మాట్లాడిన సోనియా.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ విరమణ గురించి ఇందులో ప్రస్తావించారు. దీనికి ముందు.. భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. బీజేపీ హయాంలో అన్నివర్గాలకు అన్యాయం జరుగుతుందని సోనియా ఆరోపించారు. రాజ్యాంగ విలువలను ప్రభుత్వం పాటించడం లేదని.. దర్యాప్తు సంస్థలను తుంగలో తొక్కుతుందని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలు ఆర్ఎస్ఎస్ బీజేపీ నియంత్రణలో ఉన్నాయని సోనియా మండిపడ్డారు. భాజపా పాలనలో.. దళితులు, మైనార్టీలు, మహిళలు అనేత చిత్రహింసలకు గురవుతున్నారని ఆరోపించారు. పారిశ్రామిక వేత్తలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశామని సోనియా అన్నారు. నేడు దేశానికి.. కాంగ్రెస్‌కు సవాలుతో కూడిన సమయమని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో దేశ ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించామని పేర్కొన్నారు.
రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు
సోనియా గాంధీ రాజకీయాల నుంచి విరమణపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని సోనియా గాంధీ ప్రస్తావించారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు కీలక మలుపు అని అన్నారు. నా రాజకీయం.. భారత్ జోడో యాత్రతో ముగిస్తుందని సోనియా అన్నారు. భారత ప్రజల సామరస్యం.. సహనం, సమానత్వాన్ని తాను కోరుకుంటానని సోనియా తెలిపారు. భారత్ జోడో యాత్ర.. ప్రజలు, పార్టీ మధ్య సంబంధాలను పునరుద్ధరించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజలతో నిలబడి, పోరాడటానికి వారు సిద్ధంగా ఉన్నారని ఈ యాత్ర ద్వారా తెలిసిందని సోనియా అన్నారు. 3600 కిలో మీటర్ల కష్టతరమైన పాదయాత్రను.. రాహుల్ ఉత్సాహంగా పూర్తిచేశాడని అన్నారు. భారత్ జోడో యాత్ర కోసం కష్టపడిన పార్టీ కార్యకర్తలకు.. రాహుల్ గాంధీకి సోనియా కృతజ్ఞతలు తెలిపారు.