Site icon Prime9

Raids at BBC: రెండో రోజు బీబీసీలో ఐటీ సోదాలు.. స్పందించిన అగ్రరాజ్యం

Raids at BBC

Raids at BBC

Raids at BBC: ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో రెండో రోజు ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఢిల్లీ, ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో ఈ సర్వే జరుగుతోంది.

గోద్రా అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తర్వాత ఐటీ అధికారులు సర్వే పేరుతో ఈ తనిఖీలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశం పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

స్పందించిన అగ్రదేశం(Raids at BBC)

తాజాగా బీబీసీ పై ఐటీ అధికారులు చేస్తున్న సర్వే పై అమెరికా స్పందించింది. ‘బీబీసీలో సోదాల అంశం మా దృష్టికి వచ్చింది. ఈ దాడుల అంశంపై పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా మీడియా సేచ్ఛకు మేము ప్రాధాన్యం ఇస్తున్నాం.

ప్రజా సామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భావ ప్రకటనా స్వేచ్చ, మతం దోహదపడతాయి.

భారత్ లో కూడా ఇవే బలోపేతం చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యలను మేం నిరంతనం ప్రస్తావిస్తాం.’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ వ్యాఖ్యానించారు.

అయితే బీబీసీ పై ఐటీ దాడులు ప్రజాస్వామ్య స్పూర్తికి వ్యతిరేకమా? అని అడిగిన ప్రశ్నకు నెడ్ ప్రైస్ ఆ విషయం ఇప్పుడే చెప్పలేమని సమాధానమిచ్చారు.

ఈ సోదాలపై నిజానిజాలు తమకు తెలుసని.. దీనిపై జడ్జిమెంట్ తీర్పు చెప్పే స్థితిలో తాను లేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఉద్యోగులకు మెయిల్స్..

బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాల సందర్భంగా ఉద్యోగులకు కంపెనీ మెయిల్స్ పంపింది. ఉద్యోగులందరూ ఐటీ అధికారులకు సహకిరంచాలని సూచించింది.

సదరు అధికారులు అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానం ఇవ్వాలని.. జీత భత్యాల గురించి అడిగిన ప్రశ్నలకు బదులివ్వాలని చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే వ్యక్తిగత సమాచారం, ఆదాయాలపై స్పందించాల్సిన అవసరం లేదని మెయిల్ లో పేర్కొన్నట్టు సమాచారం.

బ్రాడ్ కాస్ట్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులు ఆఫీస్ లకు రావాలని, మిగిలిన సిబ్బంది వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చని తెలిపింది.

అదే విధంగా ఈ దాడుల గురించి సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వొద్దని సిబ్బందికి సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది.

తీవ్ర అభ్యంతరాలు

ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక.. ఆయన హస్తం ఉందంటూ బీబీసీ ఇటీవల ఓ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.

‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో ఈ డాక్యుమెంటరీని విడుదల చేసింది.

అయితే, గుజరాత్ మారణకాండకు సంబంధించి మోదీకి సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇలా వివాదాస్పద డాక్యుమెంటరీ విడుదలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీంతో డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

ఈ క్రమంలో ఐటీ శాఖ మంగళవారం సోదాలు జరిపింది. 2012 నుంచి ఆదాయపు పన్ను వివరాలను పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే సోదాలను.. సర్వే గా ఐటీ అధికారులు పేర్కొంటున్నారు.

ఐటీ దాడులు జరగడంపై ప్రతిపక్షాలు, జర్నలిస్టుల సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఐటీ, ఈడీ, సీబీఐ లతో దాడులు జరిపించడం ఏంటని మండిపడ్డాయి.

Exit mobile version