Site icon Prime9

Polling in Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న పోలింగ్

Polling

Polling

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌ లో ఈ రోజు 68 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్‌ స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఆప్ కూడా బరిలో ఉండటంతో త్రిముఖ పోరు నెలకొంది. హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఎవరికీ పట్టం కడతారన్నది ఉత్కంఠ నెలకొంది. 1982 నుంచి ఒక దఫా బీజేపీ.. మరో దఫా కాంగ్రెస్‌కు అధికారం ఇస్తోన్న హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు.. ఈసారి అదే ఆనవాయితీని కొనసాగిస్తారా..? లేదా.. అందుకు భిన్నంగా చరిత్రను తిరగరాస్తారా.? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గత ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీగా పోటీ సాగగా.. ఇప్పుడు ఆప్ కూడా బరిలో నిలిచింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పనితీరుతో మళ్లీ అధికారంలోకి వస్తామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్ తన ఎన్నికల వాగ్దానాలు ఓటర్లలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తనదైన ముద్ర వేయాలని భావిస్తోంది. మొత్తం 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ మూడు పార్టీలతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు పోటీలో ఉన్నాయి.

బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధినేత జగత్ ప్రకాష్ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్‌తో సహా పార్టీ అగ్రనేతలు, ప్రియాంక గాంధీ వాద్రా ప్రచారం చేశారు. సెరాజ్‌లో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ పై కాంగ్రెస్‌కు చెందిన చేత్రమ్ ఠాకూర్, ఆప్ అభ్యర్థి గీతా నంద్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ ముఖేష్ అగ్నిహోత్రి హరోలి నుంచి పోటీ చేస్తుండగా.. ఇక్కడ బీజేపీ నుంచి రామ్‌కుమార్‌, ఆప్ నుంచి రవీందర్ పాల్ సింగ్ మాన్‌ పోటీ చేస్తున్నారు. 2017లో హిమాచల్‌లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గాను 44 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా, కాంగ్రెస్ కేవలం 21 సీట్లు మాత్రమే గెలుచుకుంది.

Exit mobile version