CM Nitish Kumar: బీహార్‌లో మహాఘట్‌బంధన్ అధ్యాయం ఇక ముగిసినట్లే అని చెప్పుకోవచ్చు.తన రాజకీయ మనుగడ కోసం ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటే బీజేపీతో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం నితీష్ బీజేపీని వీడి ఆర్‌జెడీ – కాంగ్రెస్‌తో జట్టు కట్టి మహాఘట్‌బంధన్‌గా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఏడాదిన్నర తిరక్కుండానే తిరిగి బీజేపీతో చేతులు కలపడానికి ముందుకు వచ్చారు నితీష్.
రేపు ప్రమాణ స్వీకారం..(CM Nitish Kumar)
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను అధికారికంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అందజేస్తున్నారు.నితీష్ కుమార్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు రాజ్‌భవన్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్బంగా తన రాజీనామాను సమర్పించి, తదనంతరం తాజా కూటమితో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆదివారం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.బిహార్ అసెంబ్లీలో లాలూయాదవ్‌కు చెందిన ఆర్‌జెడీకి 79 ఎమ్మెల్యేలు, బీజేపీకి 78, నితీష్‌కుమార్‌కు చెందిన జెడీ యుకు 45 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలకు 14 సీట్లున్నాయి. 243 సభ్యులు కలిగిన అసెంబ్లీలో మహాఘట్‌బంధన్‌కు 160 ఎమ్మెల్యేల మద్దతుంది. హిందుస్తాన్ అవామ్ మోర్చా – సెక్యూలర్‌కు నలుగరు ఎమ్మెల్యేలున్నారు. వీరంతా బీజేపీతో కలిసే ఉన్నారు. కాగా ప్రస్తుతం జెడీయు, బీజేపీ, హెచ్‌ఎఎం -ఎస్‌లను కలుపుకుంటే సులభంగానే మ్యాజిక్ ఫిగర్ 122 కు చేరుతుంది.
మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకులు శనివారం పాట్నాలోని పార్టీ అధినేత లాలూ ప్రసాద్ ఇంటికి ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి తరలివచ్చారు. మహాఘట్‌బంధన్ లో ఆర్జేడీ మిత్రపక్షాలు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రిని గౌరవించాయని అని తేజస్వి యాదవ్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో అనేక అనూహ్య పరిణామాలపై తేజస్వి పలు సూచనలు చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి.