Site icon Prime9

Mumbai Hoarding Collapse: ముంబైలో హోర్డింగ్ జారిపడి 14 మంది మృతి.. 70 మందికి గాయాలు

Mumbai Hoarding

Mumbai Hoarding

Mumbai Hoarding Collapse: ముంబైలో హోర్డింగ్ జారిపడిన ఘటనలో 14 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.ముంబయిలోని ఘట్‌కోపర్ ప్రాంతంలోని పెట్రోల్ పంపు పక్కన ఉన్న 100 అడుగుల హోర్డింగ్ తుఫాను గాలులకు కిందకు పడిపోవడంతో దీనికింద ఉన్న కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కార్లలో పలువురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.

హోర్డింగ్ కు అనుమతి లేదు..(Mumbai Hoarding Collapse)

మహారాష్ట్ర ప్రభుత్వ పోలీస్ హౌసింగ్ విభాగం పోలీస్ వెల్ఫేర్ కార్పొరేషన్‌కు లీజుకు ఇచ్చిన ప్లాట్‌లో ఇగో మీడియా ఈ హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. ఆవరణలో ఈగో మీడియాకు చెందిన నాలుగు హోర్డింగ్‌లు ఉండగా, అందులో ఒకటి కూలిపోయింది. ఈ ఘటనలో ఇగో మీడియా యజమానితో పాటు ప్రమేయం ఉన్న ఇతరులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇగో మీడియా మొత్తం నాలుగు హోర్డింగ్‌లకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రైల్వేస్) అనుమతి ఇచ్చినప్పటికీ వీటి ఏర్పాటుకు ముందు కార్పోరేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందలేదు. దీనితో రైల్వే మంజూరు చేసిన అన్ని అనుమతులను రద్దు చేయాలని, హోర్డింగ్‌లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ముంబయి కార్పోరేషన్ రైల్వే కమిషనర్‌కు నోటీసు జారీ చేసింది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హోర్డింగ్ కూలిపోయిన ప్రదేశాన్ని సందర్శించారు. తమ ప్రభుత్వం నగరంలోని అన్ని హోర్డింగ్‌లపై స్ట్రక్చరల్ ఆడిట్ నిర్వహిస్తుందని హామీ ఇచ్చారు.

ముంబయి నగరాన్ని సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా శక్తివంతమైన దుమ్ము తుఫానుతో చుట్టుముట్టింది.తుఫాను ధాటికి లోకల్ రైళ్లు మరియు విమానాశ్రయ సేవలు నిలిచిపోయాయి.ముంబై మరియు పరిసర ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను ప్రభావంతో థానేతో సహా పలు జిల్లాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. . థానే, అంబర్‌నాథ్, బద్లాపూర్, కళ్యాణ్, ఉల్హాస్‌నగర్ వంటి ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Exit mobile version