Lucknow Royal Saree: ఓ చీర ఖరీదు ఎంత ఉంటుంది..? రూ5 వేలు మహా అంటే రూ10వేలు ఉంటుంది. లేదు మరీ కాస్ట్లీ పట్టుచీరలు అయితే రూ.50వేలు.. ఇంకా చెప్పాలంటే ఓ లక్షా లేదా రెండు లక్షలు అనుకుందాం. కానీ ఈ చీర ధర వింటే కళ్లు తేలేయాల్సిందే. ఈ చీర ధరతో ఓ మధ్యతరగతి కుంటుంబం ఓ చిన్న ఇల్లు కొనుక్కుని బతికేస్తుంది. ఇప్పుడు ఈ చీర ధర తెలిసి సోషల్ మీడియా ప్రజలు నోరెళ్లబెడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ చీర ధర అక్షరాలా రూ.21 లక్షలు.. అంత ధర పెట్టేలా ఈ చీరలో ఏముంది అనుకుంటున్నారు కదా అయితే ఓ సారి ఈ కథనం చదివెయ్యండి.
యూపీలో చికన్ వర్క్ వస్త్రాలకు మంచి డిమాండ్ఉంటుంది. మరి ముఖ్యంగా కాన్పూర్, లక్నోలలో ఈ చికన్ వర్క్ కు ప్రసిద్ది చెందాయి. అయితే ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ బట్టల షాపులోని ఓ చీర ఇప్పుడు పెద్ద సెన్సేషన్ గా మారింది. వైట్ కలర్లో అందంగా మెరిసిపోతున్న ఈ శారీ.. ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రాయల్ చీరలో కూడా చికన్ వర్క్ ను వినియోగించారు.
పైగా ఈ చీరకు షిఫాన్, చికన్‌కారీ కుట్లతో ప్రత్యేకంగా డిజైన్ చేశారట. యూపీ రాజధాని లక్నోను ఒకప్పుడు నవాబుల నగరంగా పిలిచేవారు. అదే మాట ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకే అత్యంత ఖరీదైన చీరలకు లక్నో సిటీ బాగా ఫేమస్. ఇక ఈ రూ.21 లక్షల 9వేలు ఖరీదైన రాయల్ శారీ.. హజ్రత్‌గంజ్‌లోని అడా ఫ్యాషన్ స్టోర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి ఇంత ఖరీదైన చీరను కొనటం కూడా గొప్పగానే భావిస్తారుకదా. అయితే తయారీ రెండేళ్ల కాలం పట్టిన ఈ శారీని చికంకారీ ఫ్యాబ్రిక్ మిక్స్‌తో తయారు చేశారంట అందుకే ఈ చీరకు అంత ఖరీదని షాపు యజమానులు చెప్తున్నారు.
ఈ చీరలో స్ఫటికాలు ఉపయోగించడం వల్లే ఈ చీరకు ప్రత్యేక మెరుపు వచ్చిందని అంతే కాకుండా జపాన్ కు చెందిన ముత్యాలను కూడా ఇందులో ఉపయోగించారని పేర్కొన్నారు. కాగా ఈ చీరను దుబాయ్‌కి చెందిన ఓ మహిళ కొనుగోలు చేశారంట. ఈ మెరుస్తున్న తెల్లటి రంగు చీరను సాధారణంగా లక్నో రాయల్ చీర అని పిలుస్తున్నారు.