Lok Sabha Elections 2024 Phase 6 : లోక్ సభ ఎన్నికల ఆరవ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 58 లోకసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. వీటిలో ఢిల్లీలోని ఏడు లోకసభ సీట్లకు కూడా ఉన్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి సుమారు 57.7 శాతం పోలింగ్ జరిగిందని ఎలక్షన్ కమిషన్ ఓటర్ టర్న్‌ఔట్ యాప్ ద్వారా తెలిసింది. కాగా బరిలో మొత్తం 889 మంది అభ్యర్థులు నిలిచారు. ఓటర్ ఐడి కార్డుకు బదలుగా ప్రత్యామ్నాయంగా 12 డాక్యుమెంట్లను వినియోగించుకోవచ్చు. కాగా ఢిల్లీలో పోలింగ్ జరిగే ప్రాంతంలో లిక్కర్ షాప్‌లు బంద్ చేశారు. ఢిల్లీతో పాటు ఫరీదాబాద్, గురుగ్రామ్‌లో సాయంత్రం ఆరు గంటల వరకు లిక్కర్ షాపులకు బంద్ ప్రకటించారు.
పోలింగ్ శాతం ఎలా ఉందంటే..(Lok Sabha Elections 2024 Phase 6)
ఢిల్లీలో సాయంత్రం 5 గంటల వరకు చాందని చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, న్యూఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీలో 53.73 శాతం పోలింగ్ జరిగింది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, ఫులార్, అలహాబాద్, అంబేద్కర్‌నగర్, షారస్వతి, దొమర్యాగంజ్, బస్తీ, సంత్ కబీర్‌నగర్, లాల్‌గంజ్, అజమ్‌గఢ్, జౌన్‌పూర్, మచలిషహర్, బడోహిలలో 52.02 శాతం పోలింగ్ జరిగింది. ఇక హర్యానా విషయానికి వస్తే… అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహతక్, భివాని, మహేంద్రగఢ్, గురుగావ్, ఫరీదాబాద్‌లలో 55.93 శాతం పోలింగ్ జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే తమ్లూక్, కాంతి, ఘాతల్, జార్‌గ్రామ్, మదీనాపూర్, పురులియా, బంకురా, బిష్ణుపూర్‌లలో 77.99 శాతం పోలింగ్ జరిగింది. జార్ఖండ్ విషయానికి వస్తే గిరిధి, ధన్‌బాద్, రాంచీ, జంషెడ్‌పూర్‌లలో 61.14 శాతం పోలింగ్ జరిగింది.
ఇక బిహార్ విషయానికి వస్తే.. వాల్మీకినగర్, పశ్చిమ్ చంపారన్, పూర్వీ చంపారన్, షీయోహర్, వైశాలి, గోపాల్‌గంజ్ (ఎస్‌సీ), సివాన్, మహరాజ్‌గంజ్‌లలో 52.24 శాతం ఓట్లు పోలయ్యాయి. ఒడిషా విషయానికి వస్తే భుబనేశ్వర్, పూరి, దెంకెనాల్, కెయిన్‌జార్ (ఎస్‌సీ), కటక్, సంబల్‌పూర్‌లలో 59.60 శాతం పోలింగ్ జరిగింది. ఇక జమ్ము కశ్మీర్ విషయానికి వస్తే అనంత్‌నాగ్- రజౌరిలో 51.35 శాతం ఓటింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్ తెలిపింది.
ఇక లోకసభ ఎన్నికల సందర్బంగా అక్కడక్కడ చెదరుమదురు సంఘటనల చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పంచాయతీ స్థాయి నాయకుడిని తూర్పు మిడ్నాపూర్‌లో పోలింగ్ ప్రారంభం కావడానికి ముందే చంపేశారు. పశ్చిమ బెంగాల్‌లో అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. దీనిపై ఈసీ అధికారులు నివేదిక కోరారు. అయితే అతి పెద్ద సంఘటనలు మాత్రం జరగలేదు. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గంలో సీజేఐ చంద్రచూడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య కల్పనాదాస్‌తో సహా వచ్చి ఓటు వేశారు. ఈ రోజు భారతీయ పౌరుడుగా ఓటు వేసి తన విధి నిర్వర్తించానని ఆయన అన్నారు. గతంలో కూడా తాను దేశంలోని ప్రతిపౌరుడు తమ బాధ్యతగా ఓటు వేయాలని కోరానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.