Site icon Prime9

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంలో 237 కి చేరిన మృతుల సంఖ్య.. సంతాప దినంగా ప్రకటించిన ప్రభుత్వం !

latest news on odisha-train-accident

latest news on odisha-train-accident

Odisha Train Accident : ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా అందుతున్న సమాచారం మేరకు 237 కు చేరింది. ఈ ఘోర ప్రమాదంలో 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. అనుకోని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు ఢీ కొనడంతో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. గత దశాబ్ద కాలంలో భారత్ లో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదంగా దీన్ని భావిస్తున్నారు.

సంతాప దినంగా ప్రకటించిన ప్రభుత్వం.. 

గాయపడిన వారిలో 400 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుండగా.. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరగబడ్డ కోచ్‌ల కింద చిక్కుకుపోయి.. కాళ్లు, చేతులు తెగి.. కాపాడాలంటూ క్షతగాత్రులు ఆర్తనాదాలు చేయడం హృదయవిదారకంగా మారింది. దీనిపై విచారం వ్యక్తం చేసిన కేంద్ర రైల్వే మంత్రి హై లెవెల్‌ విచారణకు ఆదేశించింది. మరోవైపు ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాప సూచకంగా నేడు (జూన్‌ 3)ను సంతాప దినంగా ప్రభుత్వం ప్రకటించింది.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌తోపాటు ఐదు ప్రధాన నగరాల్లోని ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. బాలేశ్వర్‌, భువనేశ్వర్‌, భద్రక్‌, మయూర్‌బంజ్‌, కటక్‌ల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు వందల మంది బాధితుల్ని తరలించారు. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన ప్రయాణికులు ఇప్పటికీ యాక్సిడెంట్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. ప్రమాదాన్ని జరిగిన తీరును చెబుతూ భయాందోళనకు గురవుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు, పోలీసులు రాత్రి నుంచి నుంచి సహాయక చర్యలు చేపడుతూ బాధితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

ఎలా జరిగింది అంటే.. 

స్థానికుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హావ్ డాకు వెళుతున్న బెంగళూరు-హావ్ డా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ జిల్లాలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైలు బోగీలు ట్రాక్ పై పడ్డాయి. అప్పుడే వచ్చిన షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. దీని వల్ల కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 15 బోగీలు బోల్తా పడ్డాయి. అనంతరం బోల్తాపడిన కోరమండల్ బోగీలపైకి గూడ్సు రైలు దూసుకువచ్చి ఢీకొంది అని భావిస్తున్నారు. మూడు రైళ్లు ఒకదాంతో మరొకటి ఢీకొనడంతో ప్రమాదం తీవ్రత అనూహ్యంగా పెరిగింది. అయితే అధికారులు ఈ ప్రమాదం గురించి మరో విధంగా కూడా వివరించడం ఇప్పుడు పలు ప్రశ్నలకు దారి తీస్తుంది.

Exit mobile version