Site icon Prime9

Punjab: పంజాబ్‌ మహిళా ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న భర్త

Husband slaps on Punjab woman MLA

Husband slaps on Punjab woman MLA

Punjab: పంజాబ్‌లో ఆప్‌ ఎమ్మెల్యే బల్జిందర్‌ కౌర్‌పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. పంజాబ్‌లోని తన నివాసంలో రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

పంజాబ్‌లోని తాల్వండి సాబో నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జిందర్‌ కౌర్‌.. ఆమె భర్త సుఖ్‌రాజ్‌ సింగ్‌ మధ్య ఏదో కారణంతో వాగ్వాదం చోటుచేసుకుంది. పట్టలేని ఆవేశంతో సుఖ్‌రాజ్‌ అందరూ చూస్తుండగానే బల్జిందర్‌పై చేయిచేసుకున్నారు. దీంతో పక్కనున్నవారు వెంటనే అడ్డుకుని ఆయనను అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లారు. జులై 10న ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బ్రిందర్‌ ఈ వీడియో ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ విచారం వ్యక్తం చేశారు. ఆమెపై చేయి చేసుకోవడం దిగ్భ్రాంతికరమని, ఇకనైనా పురుషుల ఆలోచనాధోరణి మారాలని అకాంక్షించారు యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు.

ఈ ఘటనపై పంజాబ్‌ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలను లేవనెత్తే మహిళలు ఇంట్లోనే వేధింపులు ఎదుర్కోవడం దారుణమని పేర్కొంది. ఈ ఘటనను సుమోటోగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే దీనిపై బల్జిందర్‌ కౌర్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పోలీసులకు కూడా ఆమె నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిసింది. పంజాబ్‌లోని మఝా ప్రాంతంలో ఆప్‌ యూత్‌ విభాగ కన్వీనర్‌ అయిన సుఖ్‌రాజ్‌తో.. బల్జిందర్‌ కౌర్‌కు 2019 ఫిబ్రవరిలో వివాహమైంది. పాటియాలాలోని పంజాబ్‌ యూనివర్శిటీ నుంచి ఎంఫిల్‌ పూర్తిచేసిన కౌర్‌ రాజకీయాల్లోకి రాకముందు ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తాల్వండి సాబో నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Exit mobile version