Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు, భాజాపా ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ మహిళా రెజ్లర్లతో పాటు మరికొంతమంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విషయం విధితమే. అయితే ఈ నిరసన కాస్త బుధవారం రాత్రి 11గంటల సమయంలో ఉద్రిక్తతతకు దారితీసింది. పోలీసులకు, రెజ్లర్లకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు తమపై దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ హోంమంత్రి అమిత్ షాకు బజరంగ్ పునియా లేఖ రాశారు. ఈ వివాదంపై మహిళా క్రీడాకారిణి గీతా ఫోగట్ ట్వీట్ చేశారు. రెజర్లపై పోలీసులు చేసిన దాడిలో తన తమ్ముడు దుష్యంత్ ఫోగట్ తలకు గాయమైందని, మరో రెజ్లర్ కూడా గాయపడ్డాడని ఆమె తెలిపింది. ఇది చాలా సిగ్గుచేటు అన్నారు.
మంచాలతో స్టార్ అయిన గొడవ(Wrestlers Protest)
ఇదిలా ఉంటే ఆప్ నేత ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అనుమతి లేకుండా రెజ్లర్ల కోసం నిరసనకారుల స్థలంలో మడత మంచాలను తీసుకురావడంతోనే ఈ వివాదం జరిగినట్లు తెలుస్తోంది. పర్మిషన్ లేకుండా మంచాలను తీసుకురావడంపై భారతి అనుచరులను ప్రశ్నించగా చిన్న వాగ్వాదం చోటుచేసుకుందని దానితో ఎమ్మెల్యే భారతి సహా కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు వివరించారు.
అమిత్ షాకు లెటర్
ఈ వివాదంపై రెజ్లర్ బజరంగ్ హోమంత్రి అమిత్ షాకు లెటర్ రాశారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై ఢిల్లీ పోలీసులు దాడిచేశారని ఆయన పేర్కొన్నారు. మే3న 11గంటల సమయంలో తాము రాత్రి విశ్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తుండగా, ఢిల్లీ పోలీస్ ఏసీపీ ధర్మేంద్ర 100 మంది సిబ్బందితో వచ్చి తమపై దాడి చేసినట్లు లేఖలో వివరించారు. ఈ దాడిలో దుష్యంత ఫోగట్, రాహుల్ యాదవ్ తలలకు గాయాలయ్యాయని తెలిపారు.
అంతేకాక, ఒలింపియన్ వినేష్ ఫోగట్ పట్ల పోలీసులు దుర్భాషలాడారని.. సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్ పట్ల దురుసుగా ప్రవర్తించారని బజరంగ్ పునియా అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న క్రీడాకారుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పునియా ఈ లేఖలో డిమాండ్ చేశారు.