Banglore: భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలమయింది. ప్రజలను ఖాళీ చేయడానికి తెప్పలను పంపమని అధికారులను ప్రేరేపించారు. బెల్లందూర్, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్ మరియు బిఈఎంఎల్ లే అవుట్ వంటి ప్రాంతాలు ఎక్కువగా వరదనీటిలో చిక్కుకున్నాయి.
గంటల తరబడి వర్షం అనేక ప్రాంతాలను ముంచెత్తడంతో నెటిజన్లు పలువరు సోషల్ మీడియాలో దృశ్యాలను షేర్ చేసి సహాయంకోరుతున్నారు. మారతహళ్లిలోని స్పైస్ గార్డెన్ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు తేలియాడుతూ కనిపించాయి. నీరు నిలిచిపోవడంతో స్పైస్ గార్డెన్ నుంచి వైట్‌ఫీల్డ్‌కు వెళ్లే రహదారిని బ్లాక్ చేశారు. బెంగళూరు శివార్లలో ఉన్న టెక్ పార్కులకు నగరాన్ని కలుపుతున్న ఔటర్ రింగ్ రోడ్డు పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎకో స్పేస్ సమీపంలోని ఒఆర్ఆర్ బెల్లందూర్ కు మురికినీటి కాలువల నుండి వర్షపు నీరు ప్రవహించడంతో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. బెంగళూరు అంతటా వేలాది ఇళ్లు ముంపునకు గురయ్యాయని, వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తామని అధికారులు తెలిపారు.
మరోవైపు, భారత వాతావరణ శాఖ సెప్టెంబర్ 9 వరకు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బెంగళూరు, కోస్తా కర్ణాటకలోని మూడు జిల్లాలు మరియు రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు జిల్లాలకు సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు.ప్రమాదకరమైన, వేగవంతమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఉత్తరాది జిల్లాలైన బీదర్, కలబురగి, విజయపుర, గడగ్, ధార్వాడ్, హవేరి, దావణగెరెలలో రానున్న నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అంచనా.