Site icon Prime9

Vikram-S Rocket: రేపు నింగిలోకి దూసుకువెడుతున్న మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్‌–ఎస్‌’

vikram-s-rocket

Private rocket: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్ర సృష్టించేందుకు అడుగులు వేస్తోంది. అంతరిక్ష ప్రయోగాలకు ప్రయివేట్ రంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మొట్ట మొదటిసారి ఓ ప్రయివేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం వేదిక కానుంది. ప్రైవేట్‌ రంగంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాకెట్‌ ‘విక్రమ్‌–ఎస్‌’ ప్రయోగాన్ని శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి రేపు ప్రయోగిస్తారు. విక్రమ్‌–ఎస్‌ రాకెట్‌ను హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అనే ప్రైవేట్‌ స్టార్టప్‌ కంపెనీ అభివృద్ధి చేసింది. ప్రైవేట్‌ రంగంలో రాకెట్‌ను అభివృద్ధి చేసి, ప్రయోగిస్తుండడం దేశంలో ఇదే మొదటిసారి కానుంది.

విక్రమ్‌–ఎస్‌ రాకెట్‌ మూడు పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. వీటిలో విద్యార్థులు తయారు చేసిన 2.5 కిలోల పేలోడ్‌ సైతం ఉంది. స్పేస్‌ కిడ్స్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనిని తయారు చేశారు. విక్రమ్‌–1 రాకెట్‌ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్‌–2.. 595 కిలోలు, విక్రమ్‌–3.. 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లనున్నాయి. దేశంలో అంతరిక్ష సాంకేతికరంగ నూతన సంస్థలకు ప్రోత్సాహం, నియంత్రణలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఇన్‌–స్పేస్‌’ సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ప్రైవేట్‌ విక్రమ్‌–ఎస్‌ రాకెట్‌ ప్రయోగానికి ఇన్‌–స్పేస్‌ నుంచి క్లియరెన్స్‌ కూడా లభించింది.

‘విక్రమ్‌–ఎస్‌’ ప్రయోగాన్ని ఈ నెల 12వ తేదీనే పట్టేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో తొలుత ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. ఆ తర్వాత రేపటికి ఈ ప్రయోగాన్ని చేపట్టాలని నిర్ణయించారు. భారత అంతరిక్ష పితామహుడు, దివంగత శాస్త్రవేత్త విక్రమ్‌ సారాబాయికి నివాళిగా ఈ రాకెట్‌కు ‘విక్రమ్‌-ఎస్‌’ అని పేరుపెట్టారు. ప్రైవేటులో ఇదే తొలి మిషన్‌ కావడంతో ప్రారంభ్‌ మిషన్‌గానూ దీన్ని పిలుస్తున్నారు.

Exit mobile version