Agri Gold Scam: అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర్ అనే వ్యక్తులపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారితోపాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఛార్జిషీట్ వేసింది. ఈడీ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన హైదరాబాద్‌లోని నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు.. అక్టోబరు 3వ తేదీన కోర్టుకు హాజరుకావాలంటూ అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీలకు కోర్టు సమన్లు జారీ చేసింది.
4వేల కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ..( Agri Gold Scam)
అగ్రిగోల్డ్ కేసులో 4వేల,141 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో సుమారు 32 లక్షల మందిని.. దాదాపు 6వేల 380 కోట్ల రూపాయల మోసం చేసినట్లు ఏపీ సీఐడీ అభియోగం మోపింది. ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల ఆధారంగా.. నిధుల మళ్లింపుపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం.. ఈడీ విచారణ జరిపింది. విచారణలో భాగంగా రెండు విడతల్లో సుమారు 4 వేల 141 కోట్ల రూపాయల విలువైన భూములు, భవనాలు ఇతర స్థిరచరాస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి.. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ను ఇప్పటికే అరెస్టు చేసి, విచారణ జరిపింది. అధిక వడ్డీ, ప్లాట్ల పేరిట డిపాజిటర్ల నుంచి డబ్బులు వసూలు చేసి.. డొల్ల కంపెనీలకు నిధులు మళ్లించి, వాటి పేరిట ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అభియోగం మోపింది.