Deccan Chronicle promoters: ఎనిమిది వేల కోట్ల రూపాయల బ్యాంకు ఫ్రాడ్ కేసులో డక్కన్ క్రానికల్ సంస్థకి చెందిన 14 ఆస్తులని ఈడీ అధికారులు అటాచ్ చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులోని ఆస్తులని ఈడీ అధికారులు సీజ్ చేశారు. కెనరా, ఐడిబిఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గతంలో కూడా 386 కోట్ల రూపాయల ఆస్తులని ఈడీ అధికారులు అటాచ్ చేశారు. డక్కన్ క్రానికల్ ప్రమోటర్లు టి. వెంకట్రాం రెడ్డి, మణి అయ్యర్‌నిఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
మనీలాండరింగ్ చట్టం కింద..(Deccan Chronicle promoters)
విచారణకు సహకరించడం లేదన్న ఆరోపణలతో ఈ ముగ్గురిని మంగళవారం ఈడీ ప్రశ్నించి సాయంత్రం అరెస్టు చేసింది. వీరిని హైదరాబాద్‌లోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.2013లో, బ్యాంకుల కన్సార్టియం రుణాలు చెల్లించకపోవడంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.2015లో కెనరా బ్యాంకు నుంచి తీసుకున్న రూ.357 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టారనే ఆరోపణలపై వెంకట్‌రామ్‌రెడ్డి, ఆయన సోదరుడు, మరో ప్రమోటర్ టి.వినాయక్ రవిరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది.