Punjab: ఇండియా సరిహద్దు భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్ ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూల్చివేశారు. నేటి తెల్లవారుజామున 4.30గంటలకు అజ్నాలా సబ్ డివిజన్ పరిధిలోని రామ్ సాస్ గ్రామం సమీపంలోని షాపూర్ సరిహద్దు ఔట్ పోస్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకొనింది.
విధి నిర్వహణలో ఉన్న 73 బెటాలియన్ జవాన్లు దేశ భూభాగంలోకి వచ్చిన డ్రోన్‌ను నేల కూల్చారు. డ్రోన్ శబ్ధంతో జవాన్లు అప్రమత్తమైనారని, వెంటనే కాల్పులు జరిపి దాన్ని కూల్చివేశారని గురుదాస్‌పూర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ప్రభాకర్ జోషి తెలిపారు. అనంతరం ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టామని వెల్లడించారు. డ్రోన్ సాయంతో సరిహద్దుల్లో ఏవైనా అనుమానాస్పద పరికరాలను మన భూభాగం పైకి వదిలారా అనే కోణంలో గాలిస్తున్నామని చెప్పారు.
డ్రోన్‌పై జవాన్లు మొత్తం 17 రౌండ్ల కాల్పులు జరపడంతో, డ్రోన్ పైభాగంలోని ఓ బ్లేడ్ దెబ్బతిన్నదని వెల్లడించారు. అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకుంటున్నామని తెలిపారు. గత తొమ్మిది నెలల్లో పాకిస్థాన్ వైపు నుంచి మొత్తం 191 డ్రోన్లు భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డాయని చెప్పారు. ఇవి అంతర్గత భద్రతకు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: భారత్ సాయం కోరిన పాకిస్తాన్.. ఎందుకంటే?