Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. సోమవారం అర్థరాత్రి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై ని ఈడీ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో జరిగిన అవకతవకలపై ఇటీవల రెండు రోజుల పాటు రామచంద్ర పిళ్ళైని ఈడీ ప్రశ్నించింది.
ఈ క్రమంలో సోమవారం అరుణ్ రామచంద్రను అరెస్టు చేసినట్టు ఈడీ వర్గాలు (Delhi liquor scam) వెల్లడించాయి. అదే విధంగా అరుణ్ పిళ్ళైకి చెందిన రూ . 2.2 కోట్ల విలువైన భూమిని కూడా ఈడీ జప్తు చేసింది.
ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. అరుణ్ రామచంద్ర పిళ్లై రాబిన్ డిస్టిలరీస్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్.. రామచంద్ర పిళ్ళైను ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వివిధ దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది.
తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నాయకులతో అరుణ్ పిళ్లై కు సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన వారిలో ఎక్కువగా హైదరాబాద్‌కు చెందిన వాళ్లే ఉన్నారు.
ఈ స్కామ్‌లో అభిషేక్ బోయిన్‌పల్లి, సమీర్ మహేంద్రూ, విజయ్ నాయర్ తదితరులకు రామచంద్ర పిళ్లై సహకరించారని ఈడీ భావిస్తోంది.
కాగా ఈ వరుస అరెస్ట్‌ల నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి వచ్చింది.
తదుపరి అరెస్ట్ ఆమెనంటూ ప్రచారం వీపరీతంటా జరుగుతోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అరెస్టైన విషయం తెలిసిందే. ఇక ముందు కూడా మరిన్ని అరెస్ట్‌లు ఉండే అవకాశముందని తెలుస్తోంది.
మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ మంగళవారం ప్రశ్నించనుంది.
ఈ కేసులో సిసోడియాకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.
దీంతో కోర్టు విచారణ అనంతరం సిసోదియాను నేరుగా తీహార్ జైలుకు తీసుకొచ్చారు. అక్కడ జైలు నంబర్ 1 గదిని ఆయనకు కేటాయించారు.
జైల్లో భగవద్గీతతో పాటు కళ్లజోడు, డైరీ, పెన్ను, వైద్యులు సూచించిన మందులను ఉంచుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది.
విపాసన ధ్యానం చేసేందుకు అనుమతినివ్వాలని సిసోడియా న్యాయవాది కోర్టును కోరగా, ఆ అభ్యర్థనను పరిశీలించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
తీహార్ జైలులో ఉన్న సిసోడియాను ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.