Site icon Prime9

PM Modi in Odisha: కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కదు!.. ప్రధాని నరేంద్రమోదీ

PM Modi in Odisha

PM Modi in Odisha

PM Modi in Odisha: దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్‌ పీక్‌కు చేరుకుంది. సోమవారం నాడు మూడవ విడత పోలింగ్‌ జరుగనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం కాంగ్రెస్‌ పార్టీపై ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఒడిషాలో నాలుగవ విడత అంటే మే 1న ఒకటే సారి లోకసభతో పాటు శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా ప్రధాని శనివారం నాడు ఒడిషాలోని కందమాల్‌ లోకసభ నియోజకవర్గంలోని పుల్‌బానీలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. యధాప్రకారం కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.

కనీసం 50 సీట్లు కూడా రావు..(PM Modi in Odisha)

వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కనీసం 50 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. లోకసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని శాపనార్థాలు పెట్టారు. రాష్ర్టంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఒడియా భాష ఇక్కడి సంస్కృతి గురించి బాగా తెలిసిన వ్యక్తిని మాత్రమే ముఖ్యమంత్రిగా నియమిస్తామని ఇక్కడి ప్రజలకు ప్రధాని హామీ ఇచ్చారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఎన్‌డీఏ 400 సీట్లు సునాయాసంగా గెలుస్తుందన్నారు. ఇండియా ప్రజలు ఇప్పటికే ఎన్‌డీఏ గెలిపించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌కు జూన్‌ 4 తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వరాదని నిర్ణయించుకున్నారని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్వాకం వల్ల జమ్ము కశ్మీర్‌ ప్రజలు గత 60 సంవత్సరాల నుంచి టెర్రరిజం బారిన పడ్డారన్నారు. దేశంలోకి టెర్రరిస్టులు యధేచ్చగా ప్రవేశించి అమాయక ప్రజలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన ఘటనలు మనకు తెలిసిందేన్నారు. కాంగ్రెస్‌ నాయకులు టెర్రరిస్టు ఆర్గనైజేషన్లతో సమావేశాలు నిర్వహించిన ఉదంతాలు మనకు విదితమే. 26/11 దాడుల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ టెర్రరిస్టులపై దాడులు చేయడానికి జంకిందన్నారు. దీనికి కారణం పాక్‌ టెర్రరిస్టులపై దాడులు చేస్తే.. ఓటు బ్యాంకు దెబ్బతింటుందని భయపడ్డారని మోదీ ఎద్దేవా చేశారు.

కాగా ఒడిషా శాసనసభతో పాటు లోకసభ ఎన్నికలు మే1న జరుగనున్నాయి. అయితే ఒడిషాలోని 21 లోకసభ ఎన్నికలు నాలుగు విడతల్లో జరుగనున్నాయి. అవి మే 13, మే 20, మే 25 జూన్‌ 1న జరుగనున్నాయి. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో బిజు జనతాదళ్‌ (బీజేడీ) 12 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ 8 సీట్లు, కాంగ్రెస్‌ పార్టీ కేవంల ఒక్క సీటుకే పరిమితం అయ్యింది.

Exit mobile version