Congress President Election: కొనసాగుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల కౌంటింగ్

ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.

  • Written By:
  • Publish Date - October 19, 2022 / 12:36 PM IST

Delhi: ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సోమవారం జరిగిన ఎన్నికల్లో 9,915 మంది అర్హులైన నాయకుల్లో 96 శాతం మంది ఓటు వేసినట్లు కాంగ్రెస్ తెలిపింది.20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి అధ్యక్షుడిగా నేడు ఎన్నికవుతున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షపదవికి రేసులో మల్లికార్జున్ ఖర్గే శశి థరూర్‌ తలపడ్డారు. అయితే గాంధీ కుటుంబం ఆశీస్సులు చిరకాల విధేయుడైన మల్లికార్జున్ ఖర్గేకు ఉన్నందున రేసులో ముందుంటారని భావిస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు కూడ విమర్శలను ఎక్కుపెట్టాయి. ఖర్గే గెలిస్తే పార్టీని గాంధీలు రిమోట్ కంట్రోల్ తో నడిపిస్తారని వారు ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ దీనిని కొట్టిపారేసింది.ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగాయని కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ సంతృప్తి వ్యక్తం చేశారు.2014 మరియు 2019 సార్వత్రిక ఎన్నికలలో పార్టీని వరుసగా రెండు పరాజయాలకు బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తప్పుకున్నపుడు సోనియా గాంధీ తాత్కాలికంగా పార్టీని నడిపించడానికి అంగీకరించిన మూడేళ్ల తర్వాత ఎన్నికలు వచ్చాయి.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రేసు ప్రారంభం కాకముందే పోటీ నుండి తప్పుకున్నాక ఖర్గే చివరి నిమిషంలో పోటీకి దిగారు. మొదట అశోక్ గెహ్లాట్ అభ్యర్థిత్వాన్ని సమర్దించిన కుటుంబం అతని ప్రధాన ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిగా చేయకుండా ఉండటానికి కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగ తిరుగుబాటును ప్రారంభించడంతో అసంతృప్తి చెంది అతడిని పక్కకు పెట్టారు.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబానికి చెందిన వారే ఎక్కువగా నాయకత్వం వహిస్తున్నారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1939లో మహాత్మాగాంధీ మద్దతుతో పోటీచేసిన పట్టాభి సీతారామయ్య నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓడిపోయారు.