Site icon Prime9

హిమాలయన్ వయాగ్రా: మగవారిలో లైంగిక సామర్థ్యం పెంచే ఈ మూలికల కోసమే చైనా భారత్‌లోకి చొరబడుతోందా?

china army entered into Indian territory for cordyceps fungus

china army entered into Indian territory for cordyceps fungus

Cordyceps: భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం చూస్తూనే ఉన్నాం. దాడులతో ఆ ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటూనే ఉంటున్నాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ ప్రాంతంలో అయితే చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రెండుదేశాల మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతూనే ఉంటున్నాయి. ఇకపోతే ఇటీవల వారం రోజుల క్రితం ఈ ప్రాంతంలోనే అనగా తవాంగ్‌ సెక్టార్‌లో చైనా సైనికులు అక్రమంగా సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించిన క్రమంలో భారత సైన్యం వారి ఆగమనాన్ని తిప్పికొట్టింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణ వల్ల పలువురికి గాయాలయ్యాయి. కాగా ఇరుదేశాల సరిహద్దుల్లో సంభవిస్తున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆర్మీ అధికారులు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు. కానీ ఎటువంటి లాభం లేకపోయింది. చైనా సైన్యం తన పరిధిదాటి హద్దుమీరి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. వారి ఎత్తుగడలను భారత బలగాలు తిప్పికొడుతూనే ఉన్నాయి.

హిమాలయ గోల్డ్ కోసమే..

అయితే చైనా ఎందుకు ఇంతలా భారత భాగంలోని ఆ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ఆరాటపడుతుందన్న విషయం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కాగా ఈ విషయంపై ఇండో–పసిఫిక్ ఫర్ స్ట్రాలెజిక్ కమ్యూనికేషన్స్ (ఐపీసీఎస్‌సీ) ఓ సర్వే చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం కంటే విలువైన ఓ ఫంగస్‌ కోసమే చైనా సైనికులు చొరబడుతున్నారని తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో హిమాలయ గోల్డ్ గా పిలుచుకునే కార్డిసెప్స్ ఫంగస్ లేదా గొంగళి పురుగు ఫంగస్ కోసమేనని చైనా సైన్యం చొరబాటుకు పాల్పడుతోందని ఇండో–పసిఫిక్ ఫర్ స్ట్రాలెజిక్ కమ్యూనికేషన్స్ (ఐపీసీఎస్‌సీ) ఓ నివేదికలో వెల్లడించింది.

ఈ ఫంగస్ కు డిమాండ్ ఎక్కువే

పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్ ఫంగస్ ఎక్కువగా భారత్‌లోని హిమాలయ ప్రాంతంతో పాటు చైనా నైరుతిలోని కింగై–టిబెట్ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాగా వీటి ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రపంచ దేశాలన్నింటి కంటే చైనా ఎప్పుడూ ముందుంటుంది. అయితే ఇటీవలి కాలంలో కింగై ప్రాంతంలో వీటి సాగు విపరీతంగా క్షీణించడంతో ఆ ప్రాంతంలో ఈ ఫంగస్ కు కొరత ఏర్పడింది. దానితో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక చైనాతో పాటు ఇతర దేశాల్లోనూ వీటికి విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని వెతుక్కుంటూనే చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐపీసీఎస్‌సీ నివేదిక తెలిపింది.

సూపర్ మష్రూమ్స్ ఖరీదు ఎంతో తెలుసా

అత్యంత అరుదుగా లభించే ఈ ఫంగస్‌లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి పసుపు, కాషాయ రంగులో సన్నటి పోగులా ఉండే వీటిని సూపర్‌ మష్రూమ్స్‌గా పిలుస్తారు. ఈ కార్డిసెప్స్‌ అత్యంత ఖరీదైనవి, బంగారం కంటే వీటి ధర ఎక్కువట. కార్డిసెప్స్‌ 10 గ్రాముల ధర సుమారు 700 డాలర్లు అనగా మన కరెన్సీలో సుమారు రూ. 56 వేలు ఉన్నట్లు తెలుస్తోంది. మేలైన కార్డిసెప్స్ రకం కిలో ధర లక్షల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.2022 నివేదిక ప్రకారం, అంతర్జాతీయంగా కార్డిసెప్స్‌ మార్కెట్‌ విలువ వెయ్యి మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు చెప్తున్నారు.

ఈ ఫంగస్ ఎలా పెరుగుతుందంటే..
హిమాలయన్ వయాగ్రాగా పేరొందిన కీడా జాడీ, యర్సగుంబా అని పిలువబడే కాటర్ పిల్లర్ ఫంగస్ కేవలం హిమాలయ పర్వత శ్రేణుల్లో మాత్రమే లభ్యమయ్యే అరుదైన సహజ ఔషధం. గొంగళి పురుగుకు నేలలో ఉండే ఫంగస్ సోకి, చనిపోయాక యర్సగుంబాగా మారుతుంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు పది వేల అడుగుల ఎత్తులో పెరుగుతుంటుంది. ఇక ఈ ఫంగస్ ను సేకరించేందుకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలోని ప్రజలు మే, జూన్ నెలల్లో పర్వతాలపైకి వెళ్తుంటారు.

లైంగిక సమస్యలకు చక్కటి ఔషధం
మరి అసలు ఈ వయాగ్రాకు ఇంత డిమాండ్ ఎందుకు అనే ప్రశ్నలు తలతెత్తున్నాయి కదా. దానికి, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో పాటు పని ఒత్తిడి వంటి కారణాల వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి ఈ లైంగిక సమస్యలకు రసాయనాల మిశ్రమం కాకుండా హిమాలయాల్లో దొరికే ఈ కార్డిసెప్స్ ఫంగస్ లేదా హిమాలయన్ వయాగ్రా ఓ గొప్ప సహజసిద్దమైన ఔషధంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలింది. ఈ హిమాలయన్ వయాగ్రా వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనీ దీని ద్వారా పురుషుల్లో ఏర్పాడే అంగ స్తంభన సమస్యలు, డయాబెటిస్, దగ్గు, జలుబు, కామెర్లు, ఆస్తమా, క్యాన్సర్‌ వంటి పలు రకాల జబ్బులు తగ్గుతాయని ప్రజల విశ్వాసం. అయితే వాతావరణంలోని మార్పుల కారణంగా, ప్రపంచంలోని అత్యంత విలువైన జీవ పదార్థాల్లో ఒకటిగా పేరొందిన ఈ హిమాలయన్ వయాగ్రా లభ్యత కూడా క్రమంగా తగ్గుతోంది. దానితో ఈ ఔషదానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఇక చైనాలో దీని లభ్యత తగ్గడంతో సమీపంలోని భారత భూభాగంలో లభించే ఈ వయాగ్రా  కోసం ఇటీవల చైనా సైన్యం ఎక్కువగా చొరబాటుకు పాల్పడుతున్నారనేది తెలుస్తోంది.

ఇదీ చదవండి: ప్రయాణీకుల కోసం ఎయిర్ ఇండియా ‘ఫాగ్‌కేర్’.. దీని ఉద్దేశ్యమేంటి?

Exit mobile version