Bay Of Bengal: పిడుగులాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ముంచుకొస్తున్న ‘మోచా’

జనరల్ గా రుతుపవనాలకు ముందు ఏప్రిల్‌-మే-జూన్‌ సీజన్‌లో బంగాళాఖాతం లో తరచూ తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ మే నెలలో తుపాన్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Bay Of Bengal: దేశమంతా అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతన్నలకు మరో పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. తూర్పు తీర రాష్ట్రాలకు వచ్చే వారంలో తుపాను ముప్పు పొంచి ఉందని తేల్చింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు ఎక్కువగా ఉండనున్నట్టు తెలుస్తోంది.

 

మే 6 కి వాయుగుండం(Bay Of Bengal)

ఢిల్లీలో జరిగిన సమావేశంలో భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహపాత్ర తుఫాన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 6 వ తేదీకి వాయుగుండం ఏర్పడే అవకాశముంది. ఆ తర్వాతి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9వ తేదీకి తుపానుగా బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది’అని ఆయన తెలిపారు.

 

‘మోచా ’ గా నామకరణం

తుపాను ఏర్పడితే దానికి ‘మోచా ’(Mocha)అని పేరు పెట్టనున్నట్టు ఐఎండీ తెలిపింది. ఈ పేరును యెమెన్‌ దేశంలోని పోర్టు నగరం మోచా పేరు మీదుగా పెట్టినట్టు పేర్కొంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత గానీ తుపాను దిశ గురించి కచ్చితమైన సమాచారం తెలుస్తుందని ఐఎండీ వెల్లడించింది. వచ్చే వారంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయిని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.

 

మే నెలలో తుపాన్ల ముప్పు

జనరల్ గా రుతుపవనాలకు ముందు ఏప్రిల్‌-మే-జూన్‌ సీజన్‌లో బంగాళాఖాతం లో తరచూ తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ మే నెలలో తుపాన్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక దేశంలో అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య తిరోగమన రుతుపవనాల ప్రభావంతో మరో తుపాను సీజన్‌ ఉంటుంది. వీటికి తోడు పశ్చిమ తీరంలోని అరేబియాసముద్రంలో కూడా తుపానులు ఏర్పడుతుంటాయని తెలిపింది.