Himachal Pradesh: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నిపధ్ సైనిక పధకాన్ని ఖచ్ఛితంగా రద్దుచేస్తామని వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లో రైతులకు రుణాలను రద్దు చేస్తామని చెప్పామని, దానిని అమలు చేశామని ఆమె తెలిపారు.
రక్షణ దళాల్లో నియామకాల కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకంను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం క్రింద ఎంపికలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల నుంచి విమర్శలు, అభ్యంతరాలు వస్తున్నప్పటికీ ఈ పథకాన్ని ఉపసంహరించేది లేదని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2022 జూన్ 14న ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం క్రింద నాలుగేళ్ళ స్వల్పకాలిక నియామకాల కోసం యువతను ఎంపిక చేసి, శిక్షణ ఇస్తారు. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. సంవత్సరానికి 46 వేల మంది అగ్నివీరులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో 40 వేల మందిని సైన్యం, మూడు వేల మందిని నావికా దళం, మూడు వేల మందిని వాయు సేన ఎంపిక చేస్తాయి. వీరికి నెలవారీ పారితోషికంతోపాటు ఇతర ప్రయోజనాలను కూడా ప్రభుత్వం అందజేస్తుంది. బీమాతోపాటు పదవీ విరమణ అనంతరం సొమ్ము కూడా లభిస్తుంది. అయితే ఈ పధకంపై పలు విమర్శలు తలెత్తాయి. సికింద్రాబాదు రైల్వే స్టేషన్ లో పెద్ద విధ్వంసమే చోటుచేసుకొనింది.
ఇది కూడా చదవండి: Isudan Gadhvi: గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్ధిగా మాజీ టివి యాంకర్.. పార్టీ ఎలా ఎన్నుకొన్నదంటే?