Ahmedabad: గుజరాత్ అహ్మదాబాద్‌లో బుధవారం విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న యాస్పయిర్-2 భవనంలో లిఫ్ట్ కూలిపోవడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. అక్కడే పనిచేస్తున్న ఏడుగురు కూలీలు మృతి చెందారు.
గుజరాత్ యూనివర్శిటీకి సమీపంలో ఈ భవన నిర్మాణం జరుగుతుంది. కాగా ఏడో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒకేసారి కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన తెల్లవారుజామున జరిగినప్పటికీ పోలీసులకు మాత్రం మధ్యాహ్నం 11 గంటల సమయంలో బిల్డర్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. లిఫ్ట్ కుప్పకూలిన సమయంలో అందులో ఎనిమిది మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై మేయర్ కేజే పర్మార్ స్పందిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ నియమ నిబంధలను బిల్టర్లు ఉల్లంఘించారా లేదా అనేది తెలుసుకుంటున్నామని, తప్పుడు బిల్డింగ్ ప్లాన్ ఇచ్చి ఉంటే వారి పై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అయితే ఈ ఘోర ప్రమాదం పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన దుర్ఘటన బాధాకరమని, ఈ ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందజేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: Suicide Attempt: పెళ్లింట విషాదం… నవ దంపతుల ఆత్మహత్యాయత్నం