Senior Actress Jayaprada : సీనియర్ నటి జయప్రదకు 6 నెలలు జైలు శిక్ష.. ఎందుకంటే ?

ఒకప్పటి స్టార్ హీరోయిన్, సీనియర్ నటి జయప్రద తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. రెండు దశాబ్దాల పాటు తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని.. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌, కృష్ణ, జితేంద్ర, రిషి కుమార్‌ లాంటి దిగ్గజ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి లోక్ సభ సభ్యురాలిగా కూడా ఎన్నికైంది.

  • Written By:
  • Publish Date - August 12, 2023 / 11:55 AM IST

Senior Actress Jayaprada : ఒకప్పటి స్టార్ హీరోయిన్, సీనియర్ నటి జయప్రద తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. రెండు దశాబ్దాల పాటు తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని.. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌, కృష్ణ, జితేంద్ర, రిషి కుమార్‌ లాంటి దిగ్గజ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి లోక్ సభ సభ్యురాలిగా కూడా ఎన్నికైంది. ప్రస్తుతం బీజేపీలో ఆమె కొనసాగుతున్నారు. అయితే తాజాగా జయప్రదకు తమిళనాడులోని ఎగ్మోర్‌ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది.

కార్మికుల ఈఎస్ఐ సొమ్ము కాజేసిన కేసులో 6 నెలల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని రాయపేటలో జయప్రద, అదే ప్రాంతానికి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి ఒక థియేటర్‌ను నిర్వహించారు. తొలుత ఈ సినిమా థియేటర్ బాగా నడిచింది కానీ తర్వాత నష్టాల బాటపట్టింది. ఈ క్రమంలోనే థియేటర్ ను క్లోజ్ చేశారు.

అయితే థియేటర్ లో పని చేసే కార్మికులకు ఈఎస్ఐ అందిస్తామని యాజమాన్యం చెప్పింది. థియేటర్ మూసివేయడంతో తమ ఈఎస్ఐ సొమ్ము ఇవ్వాలని కార్మికులు కోరారు. అయితే, కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బును థియేటర్ యాజమాన్యం లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు యాజమాన్యం చెల్లించక పోగా.. సొంత ఖర్చుల కోసం వాడుకున్నారని తేలింది. జరిగిన మోసాన్ని కార్మికులు కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో వారు కోర్టును ఆశ్రయించగా.. కార్మికులకు చెల్లించాల్సిన డబ్బును బయట సెటిల్ చేసుకుంటామని, డబ్బును వారికి వెంటనే అందిస్తామని జయప్రద తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కానీ వాటిని న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకుండా జయప్రదతో పాటు ముగ్గురికి 6 నెలల జైలు శిక్ష విధించింది. ఒక్కో నిందితుడికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది.