Janasena : పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, వారించినా, విసుక్కున్నా కూడా ఆయన ఫ్యాన్స్ మాత్రం ప్రతి మీటింగు లోనూ… ‘ సీఎం, సీఎం ’ అంటూ నినాదాలు చేస్తూనే ఉంటారు. పవన్‌ను సీఎంగా చూడాలనే వారి అభిమానం సరే… పవన్‌ను సీఎం చేసేందుకు వారి ప్రయత్నాలు ఏంటి ? అసలు పవన్ ప్రణాళికలు ఏంటి ? జనసేన పార్టీ కార్యాచరణ ఏంటి ? వీటికి ఆన్సర్స్ కావాలంటే వెతుక్కోవాల్సిందే.
మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి రాష్ట్రంలో ఉన్న అన్ని అసెంబ్లీ సీట్ల లోనూ తమ పార్టీయే గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. 175 సీట్లకు గాను 175 సీట్లు ఎందుకు గెలవకూడదు ? అంటూ ఆయన ప్రతి సమావేశంలోనూ ప్రశ్నిస్తున్నారు. జగన్ చేస్తున్న 175 ప్రకటన సైకలాజికల్ వార్‌లో భాగమా ? లేక నిజంగానే 175 సీట్లు సాధించేందుకు ప్రయత్నమా అనేది తెలియన్సీ ఉంది.
వైసీపీ 175 యాక్షన్ ప్లాన్ ఏంటి ?
- ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు లీడర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 5.2 లక్షల మంది నియామకం.
- ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ ముగ్గురు చొప్పున పార్టీ కన్వీనర్లు.
- మరో రెండు వారాల్లోనే ఈ నియామకాలన్నీ పూర్తి చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది.
అలాగే రాష్ట్రం లోని గడప గడపకూ పార్టీని తీసుకెళ్లేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పీకే టీమ్ ఇస్తున్న ప్రణాళికల్ని అమలు చేస్తున్నారు వైఎస్ జగన్.
ఇదంతా కూడా చాలా ఆర్గనైజ్డ్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు.
ఇప్పటి వరకూ బూత్ స్థాయిలోనూ కమిటీలు ఉండేవి. బీజేపీ ఉత్తరాదిలో అమలు చేస్తున్న వ్యూహాలను వైసీపీ ఇప్పుడు ఏపీలో అమలు చేస్తోంది. ప్రతి ఇంటికీ ఒక లీడర్‌ను బాధ్యులుగా నియమిస్తోంది. వార్డు, గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో కమిటీలను, వాటి రెస్పాన్సిబిలిటీస్ చూసుకునే వ్యక్తులను నియమించుకుంది.
ఎవరు ఏం చేయాలి అనే క్లారిటీ ఉంది.
వీళ్లకు సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉంది. వ్యూహాలు రచించడానికి, స్పీచ్‌లు, పంచ్‌లు, ట్రోలింగ్స్‌లో సహకరించడానికి పీకే టీమ్ ఉంది. వీళ్లకు అవసరమైతే ట్రైనింగ్ కూడా ఇచ్చేలా వైసీపీ ప్రణాళికలు చేస్తోంది. ప్రతి ఇంటికీ తిరగడం, జగన్ ప్రభుత్వం గురించి చెప్పి, ఒప్పించి, ఓట్లు పడేలా చేయడమే వీళ్ల పని.
జనసేన ఆ స్థాయిలో సిద్ధంగా ఉందా?
పవన్ కళ్యాణ్‌పై అభిమానం వేరు, జనసేన పార్టీ కోసం పనిచేయడం వేరు. జన సైనికుల్లో చాలా మందికి ఈ విషయంలో స్పష్టత లేదన్న సంగతి పవన్ ప్రసంగాల ద్వారానే చాలాసార్లు తెలిసింది. పైగా, వారికి వైసీపీ స్థాయిలో పార్టీ నుంచి మద్దతు, శిక్షణ లేవు. పీకే టీమ్ లాంటి పొలిటికల్ స్ట్రాటజీ టీమ్ కూడా జనసేనకు లేదు. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు, జనసేన నాయకుల్లో కొందరు పార్టీపైన, నాయకుడిపైన దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ తిరిగి, ప్రజలను ఒప్పించి వాళ్లకు భరోసా ఇచ్చి, వాళ్ల చేత ఓట్లు వేయించే స్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఉన్నాయా ? అన్నది మాత్రం ఒకసారి ఆలోచించుకోవాల్సిందే.
అదే విధంగా ఎన్నికలు మొదలైన తర్వాత ప్రచారం, ఖర్చు, ప్రలోభాల విషయంలో వైసీపీతో జనసేన సరితూగ లేకపోవచ్చు. కానీ, పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం, పార్టీని బలోపేతం చేసుకోవడంలో మాత్రం ఆలస్యం చేయకూడదు. రాష్ట్రంలో అత్యంత ప్రజాకర్షణ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అనడంలో సందేహం లేదు. మరి, ఆయన అభిమానులు, జన సైనికులు సరైన వ్యూహాలతో అనుకన్నది సాధిస్తారా ? వాళ్లకు పార్టీ సరైన డైరెక్షన్ ఇస్తుందా ? వంటి ప్రశ్నలకు జనసేనాని ఏం ప్రణాళికలు రూపొందించారో తెలియాల్సి ఉంది.