Andhra Pradesh: సికింద్రాబాద్ – విజయవాడ రైలులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు అదే రైలులో ప్రయణిస్తున్న మెడిసిన్ విద్యార్దిని పురుడు పోసిన ఘటన వైరల్ గా మారింది. ఈ రైలులో ప్రయాణిస్తున్న సత్యవతి అనే ఓ గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె భర్త సత్యనారాయణకి ఏం చేయాలో అర్థం కాలేదు. సాయం చేయాలని కనిపించిన వారినల్లా అడిగారు. అదే బోగీలోప్రయాణిస్తున్న విశాఖపట్నం గీతం వైద్య కళాశాల విద్యార్థిని స్వాతిరెడ్డి దీనికి వెంటనే స్పందించింది. తోటి మహిళల సహాయంతో పురుడు పోసింది. ఆడబిడ్డను ఈ లోకానికి ఆహ్వానించింది.
సత్యవతి, సత్యనారాయణలది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నం గ్రామం. స్వగ్రామానికి వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం దాటగానే కాన్పు అయింది. దురంతో ఎక్స్ ప్రెస్ కు విశాఖ వెళ్ళేదాకా ఎక్కడా హాల్ట్ లేదు. సత్యవతి పరిస్థితి గురించి టీటీఈ అందించిన సమాచారం మేరకు అనకాపల్లిలో స్టేషన్ మాస్టర్ వెంకటేశ్వరరావు రైలు ఆపించారు. 108 అంబులెన్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. గైనకాలజిస్ట్ తల్లీబిడ్డలకు వైద్య పరీక్షలు చేశారు. బిడ్డకు వైద్య సహాయం అందేవరకు స్వాతిరెడ్డి వారి వెన్నంటే ఉన్నారు. ఆమెకు సత్యవతి, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
రైలులో మెడిసిన్ విద్యార్థిని చేసిన సాయానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్వాతిరెడ్డి మాట్లాడుతూ తాను ఇప్పటివరకు తోటి వైద్యులు, సిబ్బంది సాయంతోనే డెలివరీలు చేశానని, ఒంటరిగా ఎలాంటి పరికరాలు లేకుండా చేసిన మొదటి డెలివరీ ఇదేనని చెప్పారు. ఈ అనుభవాన్ని తన జీవితంలో మరిచిపోలేనని అన్నారు.గీతం కాలేజీ యాజమాన్యం కూడా ఆమెను
అభినందించింది.-