Telangana Polls: నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 2.5 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉంటారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పటివరకు 1,68,612 పోస్టల్ బ్యాలెట్‌లు జారీ చేయగా నవంబర్ 26 వరకు 96,526 పోలింగ్ జరిగినట్లు తెలిపారు.
45 వేల మంది తెలంగాణ పోలీసులు బందోబస్తులో ఉంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి మొత్తం 23,500 మంది హోంగార్డులను కోరామని రెండురోజుల్లో వారు వస్తారని ఆయన చెప్పారు. వీరు కాకుండా తెలంగాణలోని ఇతర యూనిఫాం సేవలకు చెందిన 3,000 మంది సిబ్బందిని, 50 కంపెనీల తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ మరియు 375 కంపెనీల కేంద్ర బలగాలు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమవుతారని వికాస్ రాజ్ తెలిపారు.26,660 మంది ఓటర్లు హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారి తెలిపారు.నవంబర్ 23న తమ గమ్యస్థానాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (ఈవీఎంలు) తీసుకువెళ్లే అన్ని వాహనాలకు జీపీఎస్‌ను అమర్చి, ప్రతి వాహనం కదలికను అధికారులు ట్రాక్ చేస్తారని చెప్పారు.ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రూ.709 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం మరియు ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఇలాఉండగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు బంద్ పెట్టాలని సూచించింది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసేయాలని ఆదేశించింది. ఈ నెల 30 సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు తెరవొద్దని తెలిపింది. ఆదేశాలను ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. అలాగే అక్రమ మద్యం రవాణాపై నిఘా పెట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఈసీ సూచించింది