YS Sharmila-Revanth Reddy: వైఎస్ షర్మిల మొదటిసారిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. వచ్చే నెలలో జరగనున్న తన కుమారుడి వివాహానికి రేవంత్ రెడ్డిని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి షర్మిలను సాదరంగా ఆహ్వనించి ముచ్చటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తన మద్దతును తెలిపారు. బుధవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీ వైఎస్సార్ టీపీ ని కాంగ్రెస్ లో విలీనం చేసారు.
వాస్తవానికి షర్మిల తెలంగాణలో గత కొద్దికాలంగా తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నప్పటికీ ఆమెకు రేవంత్ రెడ్డితో పెద్దగా సంబంధాలు లేవు. ఒకానొక సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ తరపున షర్మిల పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి దీనికి అభ్యంతరం చెప్పారని షర్మిలను ఏపీ రాజకీయాలకు లేదా మరో పార్టీ పదవి ఏదైనా ఇవ్వాలంటూ కాంగ్రెస్ అగ్రనేతలకు చెప్పినట్లు సమాచారం.వీటిలో వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ ఇపుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా ఉన్నారు. మరోవైపు షర్మిలకు ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారని తెలుస్తోంది. భవిష్యత్తులో వీరిద్దరు కలిసి పనిచేయడం, పర్యటించడం తప్పదు. ఈ నేపధ్యంలో షర్మిల రేవంత్ రెడ్డిని కలవడం కాకతాళీయమైనా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకూ ముఖ్యమైన పరిణామంగానే చెప్పవచ్చు.