YS jagan with MPs: వైసీపీ ఎంపీలనుద్దేశించి తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు .ఈ సందర్భంగా ఎంపీలకు దిశా నిర్దేశం చేసారు .తాజా ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన జగన్ వరుసగా పార్టీ నేతలతో పాటు ఎమ్మెల్సీ ,ఎంపీలతోను సమావేశం అవుతున్నారు .ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించామని చెప్పారు .మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవ్వరూ చేయలేదన్నారు .ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ, ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశామని వెల్లడించారు .విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడూ చూడని సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు .ప్రజల ఇంటివద్దకే పరిపాలనను తీసుకెళ్లామని .అవినీతికి చోటులేకుండా, వివక్ష చూపకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశామన్నారు .
ఈ సందర్భంగా పార్లమెంటులో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యేయం కావాలి అని చెప్పారు . రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగానే కేంద్రానికి మద్దతు తెలపాలని సూచించారు . పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలి , ప్రజలముందు తలెత్తుకునేలా పార్లమెంటులో ఎంపీలు ముందుకుసాగాలని చెప్పారు . మన పరిపాలనను, చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారని , కచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని పేర్కొన్నారు .ఈలోగా మనం ధైర్యాన్ని కోల్పోకూడదని , విలువలు, విశ్వసనీయతతో ముందడుగులు వేయాలని సూచించారు .ఇప్పటి మాదిరే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని ,లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారని తెలియచేసారు . పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారని ప్రకటించారు .ఇక నుంచి అందరికీ నేను అందుబాటులో ఉంటానని , ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని ఆ మేరకు అడుగులు ముందుకేయాలని కోరారు .