YS Jagan Comments: నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. మే 13న పోలింగ్ సందర్బంగా పాల్వాయి గేటు వద్ద ఈవీఎం ను ధ్వంసం చేసిన పిన్నెల్లి అక్కడ ఉన్న టీడీపీ ఏజెంటును బెదిరించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద అనుచరులతో హడావుడి చేసారు. కారంపూడి సీఐ పై దాడి చేసారు. దీనితో ఆయనపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.
గురువారం పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూపిన్నెల్లిపై హత్యానేరం మోపారని.. టీడీపీకి ఓటేయలేదని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారని.. వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలి కానీ.. దౌర్జన్యం సరికాదన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని వైఎస్ జగన్ అన్నారు. ఒక ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచాడంటే ప్రజాభిమానం ఉంది కాబట్టే గెలిచాడని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో వైసీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తూ వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉండగా తాము కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ప్రతీ పధకం అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని డోర్ డెలివరీ చేసామన్నారు. శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ పండుతాయన్నారు. ప్రజలకు మేలు చేసామని చెప్పి ఓటు వేయమని అడగాలి తప్ప ఇటువంటి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇదే పరిస్దితి కొనసాగితే చంద్రబాబుకు బుద్ది చెప్పే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వల్ల వైసీపీ ఓడిపోలేదు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్ల 10 శాతం మంది ప్రజలు అటువైపు మొగ్గు చూపారు. 20 వేలు రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. బడులు మొదలయినా ఇప్పటి వరకు అమ్మవడి ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా దాడులు ఆపి చంద్రబాబు పాలనమీద దృష్టి పెట్టాలని అన్నారు.