MLC Vamsi krishna: ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన వెంటనే వంశీకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశం ఉంది.
గాజువాక నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ బరిలో నిలిచే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జనసేనాని పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. యాదవ సామాజికవర్గంలో మంచి పట్టున్న వంశీ కృష్ణ విశాఖ తూర్పు ఎమ్మెల్యే టికెట్, విశాఖ మేయర్ పదవిని ఆశించారు. కానీ వైసీపీ అధిష్టానం ఆయనకు మొండిచేయి ఇచ్చింది. నాటి నుంచి అసంతృప్తితో వున్న వంశీకృష్ణ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది.
విశాఖ మేయర్ ఎన్నిక సమయంలోనే వంశీకృష్ణ వర్గం రచ్చ రచ్చ చేసింది. పార్టీ పెద్దలు బుజ్జగించడంతో ఆయన మెత్తబడ్డారు. వంశీకృష్ణ గతంలో విశాఖ తూర్పు నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు. జనసేనలో చేరి గాజువాక నుంచి పోటీ చేయాలని వంశీ కృష్ణ పట్టుదలతో ఉన్నారు. ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ మరోసారి పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో యాదవులతో పాటు పవన్ సొంత సామాజిక వర్గ ప్రాబల్యం కూడా అధికంగానే వుంది. గాజువాక నుంచి మళ్లీ పవన్ కళ్యాన్ పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గాజువాక టికెట్ వంశీకి దక్కుతుందా లేదా అన్నది చూడాల్సి వుంది.