Vasantha krishna Prasad: గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఉయ్యూరు శ్రీనివాస్ నాకు మంచి మిత్రుడు,ప్రవాసాంధ్రుల వలన దేశానికి మంచి జరుగుతుంది. శ్రీనివాస్ పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి, ప్రజలకు నష్టం జరగాలని ఇలాంటి కార్యక్రమాన్ని చేయరు. టీడీపీ తో కలిసి కార్యక్రమం చేశారు కాబట్టి శ్రీనివాస్ పై ఇలా వివాదాలు ముసురుకుంటున్నాయి. సేవా కార్యక్రమాలు చేయడం మంచిపని. ఎన్నారైలను ఇబ్బందులు పెడితే సహాయం చేసేందుకు భవిష్యత్‌లో ఎవ్వరూ ముందుకు రారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
జనవరి ఒకటో తేదీన గుంటూరులో నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. ఈ తొక్కిసలాట రాజకీయంగా సంచలనం రేకెత్తించింది. వైసీపీ ప్రభుత్వం కూడా ఘటనపై సీరియస్‌గా రియాక్ట్ అయింది. కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించిన ఉయ్యూరు శ్రీనివాసరావు అనే ఎన్నారైపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేసింది. విజయవాడలోని ఓ హోటల్‌లో ఉన్న ఉయ్యూరు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.
గుంటూరు ఘటనను ఆధారంగా చేసుకొని సభలు, సమావేశాల నిర్వాహణపై ఆంక్షలను వైసీపీ ప్రభుత్వం విధించింది. మంత్రులు, వైసీపీ లీడర్లు టీడీపీ, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసారు. ఇటువంటి సమయంలో వైసీపీ మైలవరం శాసన సభ్యుడు వసంత చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. పార్టీ అంతా ఒకవైపు ఉంటే తానొక్కడు ఒకవైపు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.