Hyderabad: మామూలుగా అయితే ప్రేమకి, ఆపై పెళ్ళికి నిరాకరించిందని ప్రియురాలిపై పగ తీర్చుకునే ప్రియుళ్ళని చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మాజీ ప్రేమికుడి మీద పగ సాధించేందుకు ఓ యువతి అతడిని తప్పుడు కేసులో ఇరికించాలనుకుంది. హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలివి.
దూరం పెట్టాడన్న కోపంతో..(Hyderabad)
హైదరాబాద్ రహమత్ నగర్ కు చెందిన రింకీ, సరూర్ నగర్ కు చెందిన శ్రవణ్ ఇద్దరూ అమీర్ పేట లోని ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరు కొంతకాలం ప్రేమించుకున్నారు. అయితే ఏమయిందో కానీ శ్రవణ్ కొంతకాలంగా రింకీకి దూరంగా ఉంటున్నాడు. దీనితో అతనిపై కోపంతో రగలిన రింకీ ప్రియుడిని ఏదో కేసులో ఇరికించాలనుకుంది. తన స్నేహితులతో కలిసి మాజీ ప్రియుడి కారులో గంజాయి పెట్టించింది.పోలీసులకి సమాచారం అందించి పట్టించింది. కానీ అసలు గంజాయి అలవాటే లేని ప్రియుడు అదే విషయాన్ని పోలీసుల ఎదుట మొరపెట్టుకున్నాడు. దీనితో అనుమానం వచ్చిన పోలీసులు అసలు ఈ సమాచారం ఎక్కడినుంచి వచ్చిందన్న కోణంలో రివర్స్ దర్యాప్తు చేస్తే ఆ యువకుడి మాజీ ప్రియురాలి స్కెచ్ బయటపడింది. పోలీసులు రింకీ సహా కేసుతో సంబంధం ఉన్న ఏడుగురు వ్యక్తులని అరెస్ట్ చేశారు. వారివద్దనుంచి 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులని జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండుకి తరలించారు