Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ ను ,గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ని తీవ్రంగా విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తామని హెచ్చరించారు. గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోటని 9 సార్లు ఎన్నికలు జరిగితే ఇండిపెండెంట్‌తో కలిపి 8 సార్లు తెదేపా విజయం సాధించిందన్నారు. అమెరికాలో పనిచేసిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు.. ప్రజలకు సేవ చేసేందుకే ఆయన గన్నవరం నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
నవరత్నాల పేరుతో జగన్ మోసం చేశారు. ప్రజల ఆస్తులపై జగన్ ఫొటో ఎందుకు? కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి , రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు ఇస్తామని చెప్పారు . వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే మీ భూమి మీది కాదు. భూములు అమ్మాలన్నా..కొన్నాలన్నా జగన్ అనుమతి తీసుకోవాల్సిందే అని తెలిపారు . ఆస్తులు కొట్టేయడానికి జగన్ కొత్త మార్గం ఎంచుకున్నారన్నారు . ప్రైవేట్ వ్యక్తుల చేత టైటిల్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారా లేదా అంటూ ప్రశ్నించారు . మీ ఆస్తులకు భద్రత కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి. వైకాపాకు ఓటేస్తే మీ ఇంటికి గొడ్డలి వస్తుంది. ఫ్యాన్‌కు ఓటు వేస్తే.. మీ మెడకు ఉరే. ప్రభుత్వ ఉద్యోగులను సైతం వైసీపీ వేధించింది. అందుకే ఉద్యోగుల్లో నూటికి 90మంది కూటమికి ఓటేశారు అని చంద్రబాబు తెలిపారు.