KTR: కాంగ్రెస్ చేతిలో పార్టీ పరాజయం పాలైనందుకు తీవ్ర నిరాశకు లోనయినా చింతించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కేటీఆర్ ) అన్నారు. ప్రజాతీర్పును శిరసావహించి సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసారని అన్నారు.
ఈ ఫలితాలు స్పీడ్ బ్రేకర్ లాంటివి.. (KTR)
తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ పాత్ర పోషిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించిన 60 లక్షల మంది బలమైన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్.. అధైర్యపడవద్దని సూచించారు. కెసిఆర్ చెప్పినట్లుగా, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. స్దితప్రజ్జత, రాజనీతిజ్జత ఉండాలన్నారు మనం కలవరపడకూడదు. మంచి మెజారిటీ వస్తుందని అనుకున్నాం కానీ ఫలితం వేరు. ప్రజలు మాకు 39-40 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరారు. పదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపినట్లే మా పనిని సీరియస్‌గా తీసుకుంటాం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ ఫలితాలు తమకు స్పీడ్ బ్రేకర్ లాంటివని వీటినుంచి తాము గుణపాఠం నేర్చుకుంటామన్నారు. మరింత కష్టపడి పనిచేస్తామన్నారు. ఈ 25 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసామని తెలంగాణ ప్రజల దయతో రెండు సార్లు అధికారం చేపట్టామన్నారు. తాము చేపట్టిన అభివృద్దిపట్ల సంతృప్తిగా ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అవకాశమిచ్చారని వారికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలన్నారు.