TDP Chief ChandraBabu Naidu: ఏపీ, తెలంగాణలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయన్న చంద్రబాబు, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీతో పొత్తులపై చర్చలకు సమయం మించిపోయిందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేయాలా లేక కొన్నిచోట్లే చేయాలా అన్నది కమిటీ తేలుస్తుందని చంద్రబాబు తెలిపారు.
జగన్ విధానాలతో తెలంగాణకి, ఏపీకి పొంతన లేకుండా పోయిందని, ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్ అంశమని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా అంశంపైనే కేంద్రంతో విభేదించానని, మిగతా విషయాల్లో కేంద్రంతో భేదాభిప్రాయాలు లేవని చంద్రబాబు తెలిపారు. టీడీపీ గేట్లు ఓపెన్ చేస్తే.. వైసీపీ విలీనం అయిపోతుందని, వైసీపీ.. టీడీపీగా మారుతుందని చంద్రబాబు అన్నారు.1980లనుంచే టీడీపీ జాతీయ కూటమిల్లో భాగంగా ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. ఇండియా కూటమికి లీడర్ లేకపోవడం బీజేపీకి అనుకూలంగా ఉన్న అంశమని చంద్రబాబు విశ్లేషించారు. ఇండియా కూటమికి నాయకత్వం ఎవరు వహిస్తారు అనేదానిపై కామెంట్ చేయబోనని చంద్రబాబు అన్నారు. రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళెవరూ మోదీని విమర్శించడం లేదని చంద్రబాబు చెప్పారు. మోదీ వయసు గురించి మాట్లాడే దమ్ము వైసీపీ వాళ్లకు ఉందా?అని చంద్రబాబు ప్రశ్నించారు.
వైఎస్ జగన్ ఒక బచ్చా..(TDP Chief ChandraBabu Naidu)
మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేశారని, పోలవరం నిర్మాణం కూడా ఆగిపోయిందని చంద్రబాబు విమర్శించారు. రాజకీయాల్లో వైఎస్ జగన్ ఒక బచ్చా అన్న చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఆయనకి ఉన్న అనుభవం ఎంతని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఉన్న పెద్ద సమస్య జగనే అన్న చంద్రబాబు రాష్ట్రం బాగుపడాలంటే జగన్‌ను గద్దె నుండి క్రిందకు దించాలని చెప్పారు.