CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. పోరాటాలతో, త్యాగాలే పునాదిగా ఏర్పడిన రాష్ట్రమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రమంతా సమానమైన అభివృద్ది చేయాలన్న సోనియా గాంధీ సంకల్పంతో తెలంగాణ ఏర్పడింది. కాని దశాబ్దకాలం మానవహక్కులకు చోటు లేకుండా పోయిందన్నారు.
ప్రజల సమస్యలు చెప్పుకుందామంటే వినేవారు లేకుండా పోయారని అందుకే ఆ పార్టీని ఓడించారని అన్నారు. పదేళ్లపాటు కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు , నిరుద్యోగులకు, ఉద్యోగులకు, అమరవీరులకు న్యాయం జరిగేలా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. ఇక్కడ ప్రమాణస్వీకారం జరుగుతుండగానే అక్కడ ప్రగతిభవన్ ఇనుప కంచెను బద్దలు కొట్టించడం జరిగింది. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలన్నా నిరభ్యంతరంగా తమ ఆలోచనలు,ఆకాంక్షలు ప్రభుత్వంతో పంచుకోవచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలంతా భాగస్వాములే. రేపు ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాము. ప్రభుత్వంలో మీ ఆలోచనలు తీసుకంటాము. మీ అభిమాన నాయకుడిగా, మీ రేవంతన్నగా మీ మాట నిలబెడతానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శాంతిభద్రతలు కాపాడుకుంటూ తెలంగాణను ప్రపంచంలోనే పోటీపడే విధంగా తీసుకువెడతామని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికే ఉందని ప్రకటించారు. ప్రజల కష్టాన్ని వినడానికి ప్రజా భవన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ప్రకటించారు. ప్రసంగం అనంతరం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల ఫైల్ పై, వికలాంగురాలు రజిని నియామక ఉత్తర్వులపై సంతకాలు చేసారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి.ఇది మీ అన్న ఇస్తున్న మాట అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేసారు.