Tummala Nageswara Rao: ఆదివారం ఖమ్మంలోనిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై విరుచుకుపడ్డారు. పువ్వాడ ఇప్పటివరకు 4 పార్టీలు మారారని ఆయన తండ్రిని అప్రతిష్టపాలు చేశారని మండిపడ్డారు.
పువ్వాడ వయ్యారి భామ లాంటి పువ్వు.. పూజకు పనికి రాని పువ్వు పువ్వాడ అని ఎద్దేవా చేశారు. తుమ్మ చెట్టు ముదిరితే నీళ్లు లేకుండా బ్రతికి అరక లాగా మారి, రైతుకు అన్నం పెట్టడానికి తుమ్మ పనికొస్తుందన్నారు. పువ్వాడ మీ బాబు కాలంలో ట్యాంకర్లున్నాయనే విషయం మర్చిపోవద్దు అని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్‌కు దిక్కు లేని సమయంలో నేను జెండా కట్టి జిల్లాను అప్పజెప్పాను అన్నారు. కేసిఆర్‌కి మంత్రి పదవి ఇప్పించింది నేను.. కావాలంటే చంద్రబాబుని అడగవచ్చు సవాల్ చేశారు. అందరి బతుకులు ప్రజల చేతుల్లో ఉన్నాయని గుండు సున్నాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఒక స్థాయికి తీసుకోచ్చిన ఘనత నాది అని గుర్తుచేశారు.
గతంలో కేసీఆర్ కూడా తనతో పాటు టీడీపీలో ఉన్నారని ఆ సమయంలో చంద్రబాబుతో మాట్లాడి కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ కు మొదట చంద్రబాబు అటవీ శాఖ ఇచ్చారని కేసీఆర్ కు ఆ శాఖ నచ్చకపోతే బాబుతో మాట్లాడి రవాణా శాఖ ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ ఎలాగూ అంగీకరించరు కాబట్టి చంద్రబాబును అడిగితే నిజానిజాలు తెలుస్తాయని అన్నారు. కేసీఆర్ కంటే ముందు మూడుసార్లు మంత్రిగా పనిచేసిన ఘనత తనకుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను ప్రజలు గద్దె దించడం ఖాయమని జోస్యం చెప్పారు.