Janasena chief Pawan Kalyan: రైల్వే సాంకేతిక విభాగంలో ఉద్యోగాల కోసం అన్ని అర్హతలు కలిగిన యువతకు నియామకాలు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచడం దారుణమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సీసీఎఎ అర్హత సాధించిన వారు తెలుగు రాష్ట్రాల్లో 400మందిని పెండింగులో ఉంచారని తెలిపారు. ఇలా పెండింగ్‌లో ఉంచుతూ ప్రకటన ఇవ్వడంతో యువత నిరాశానిస్పృహలకు లోనవుతున్నారని పవన్ తెలిపారు. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
2019లో ఉద్యోగ ప్రకటన జారీ అయినపుడు సంబంధిత ఉద్యోగాలకు రైల్వే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటీస్ (సి.సి.ఎ.ఎ) సాధించి ఉండాలని చెప్పారు. అప్పటికి కోర్పు కంప్లీట్ చేసినా స్కిల్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖ నిర్దేశిత సమయంలో పరీక్షలు నిర్వహించలేదు. అయినా ఉద్యోగ రాత పరీక్షకు అనుమతించారు. నియామకం సమయానికి అన్ని అర్హతలు ఉన్నా ప్రకటన నాటికి సర్టిఫికెట్ లేదు అనే సాంకేతిక కారణంతో అర్హత సాధించిన వారి నియామకాన్ని పెండింగ్ లో ఉంచడం వల్ల సంబంధిత యువత ఆందోళనలో ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రైల్వే మంత్రిత్వ శాఖతో చర్చలు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు.