Pawan Kalyan: ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ఆర్దిక ఇబ్బందులపై ప్రభుత్వం మానవతా ధృక్పధంతో స్పందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు తక్కువ వేతనాలు ఇవ్వడం సరికాదన్నారు.
మాట తప్పడం అంటే ఇదే. ఈ విషయాన్ని గుర్తు చేసి నిరసన తెలియచేస్తుంటే వేధింపులకు గురిచేయడం పాలకుల నైజాన్ని తెలియజేస్తోందన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి పంచానామాలు చేస్తామని చిరుద్యోగులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న 57 వేల అంగన్వాడీ కేంద్రాల్లో లక్షమందికి పైగా మహిళలు కార్యకర్తలుగా, హెల్పర్లుగా నామమాత్రపు వేతనాలకు పనిచేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ విధానాన్ని వీరికి వర్తింప చేయాలి. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు జనసేన పార్టీ మద్దతు ప్రకటిస్తోందన్నారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.
జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్ గా బన్నీవాస్ ను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేందర్ కార్యాలయంలో నియామక ఉత్తర్వులను స్వయంగా పవన్ కళ్యాణ్ బన్నీ వాస్ కు అందజేసారు. ప్రచార విభాగం పార్టీకి కీలకమయిందని, సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని సూచించారు. పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు వినూత్న కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు.