Site icon Prime9

Pawan Kalyan : ప్రతిపక్షనేతలను తిట్టమంటారు.., రైతుల వద్దకు మంత్రులను ఎందుకు పంపరు? .. పవన్ కళ్యాణ్

YSRCP leaders who joined Janasena party under Pawan Kalyan

YSRCP leaders who joined Janasena party under Pawan Kalyan

Pawan Kalyan : ఒక వైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సాయం అందక అల్లాడిపోతున్న ఏపీ రైతులను మాండూస్ తుపాను మరింత దెబ్బతీసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు. కోతకు వచ్చిన చేలు, కళ్లంలో ఉంచిన ధాన్యం కళ్లెదుట నీటిలో నానిపోతుంటే దైన్యంగా చూస్తున్న రైతులను చూస్తుంటే గుండె భారంగా మారుతోందన్నారు. ఉమ్మడి జిల్లాలైన చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి ప్రాంతాలలో లక్షలాది ఎకరాలలో వరి పంట నీటిపాలైందన్నారు. పత్తి, బొప్పాయి, అరటి తోటలు తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయని పవన్ అన్నారు. తుపానుతో తీవ్ర నష్టం జరిగినా మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎందుకు ధైర్యం చెప్పరని ప్రశ్నించారు. ప్రత్యర్థి రాజకీయపక్షాల నాయకులను తిట్టడానికి వరుసలో నాయకులను పంపుతూ, ఏ తిట్లు తిట్టాలో స్క్రిప్టులు పంపే తాడేపల్లి పెద్దలు ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతులకు అండగా ఉండమని తమ నాయకులకు ఎందుకు పంపరని పవన్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో లక్షన్నర ఎకరాలలో వరి పూర్తిగా తుడుచుపెట్టుకుపోయిందని పవన్ ఆవేదన చెందారు. లక్షల ఎకరాలలో పంటలు నీట నానుతున్నాయన్నారు.. అందువల్ల తుపాను దెబ్బతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరంగా ఆదుకోవాలన్నారు. సహేతుకమైన పరిహారాన్ని ప్రతి ఎకరాకు చెల్లించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ఇప్పటికైనా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కూరగాయలు, పండ్ల తోటల రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

అదే విధంగా జనసేన నాయకులు, జన సైనికులు, వీరమహిళలు రైతులకు చేతనైనంతగా సాయపడాలని కోరారు. అసహాయస్థితిలో ఎదురుచూస్తున్న రైతుల పక్షాన నిలబడాలని సూచించారు. వారి దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రైతాంగానికి మానసిక ధైర్యం కల్పించి, సాయం అందకపోతే ప్రజాస్వామ్య రీతిలో ప్రశ్నించాలన్నారు

Exit mobile version