Site icon Prime9

International kidney Racket: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ వెనుక సూత్రధారి హైదరాబాద్ వైద్యుడు

kidney Racket

kidney Racket

International kidney Racket: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ సూత్రధారి గుట్టు రట్టైంది. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్‌ నాసిర్‌ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం… హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు దళారులు ఈ రాకెట్‌ను నడిపించారని.. అందులో ఒక వైద్యుడు ఉన్నాడని తేలింది. ఈ కేసులో ఎర్నాకుళం రూరల్‌ ఎస్పీ వైభవ్‌ సక్సేనా ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు సిట్‌ బృందం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇక్కడ మరో ఇద్దరు దళారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి ఇరాన్ తీసుకువెళ్లి..(International kidney Racket)

బెంగళూరు, హైదరాబాద్‌లకు చెందిన పేద యువకులను టార్గెట్ చేసుకొని ముఠా సభ్యులు ఇరాన్‌ తీసుకెళ్లి.. అక్కడ కిడ్నీలను విక్రయింపజేస్తున్నారు. బాధిత యువకుల్లో ఒకరు మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముఠాలోని కీలక సభ్యుడు సబిత్‌ ఇరాన్‌ నుంచి కొచ్చి రాగా.. గత ఆదివారం అక్కడి విమానాశ్రయంలో కేరళ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అతడిని అంగమాలి జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. రిమాండ్‌ రిపోర్టులోని వివరాల ప్రకారం.. సబిత్‌ ఈ వృత్తిలోకి రావడానికి హైదరాబాద్‌కు చెందిన వైద్యుడే ప్రధాన కారణం గుర్తించారు. 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్‌ వైద్యుడు, సబిత్‌ల మధ్య స్నేహం మొదలైంది. దీంతో బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి 40 మంది యువకులను ఇరాన్‌ తీసుకెళ్లి.. వారి కిడ్నీలు విక్రయించినట్లు సబిత్‌ అంగీకరించాడు. డబ్బు అవసరం ఉన్న పేద యువతను గుర్తించి.. వారికి డబ్బు ఆశ చూపి.. కిడ్నీలు విక్రయించేలా దళారులు ఒప్పిస్తున్నారు. వారికి కావాల్సిన పాస్‌పోర్టు, వీసాల వంటివి మరికొందరు దళారులు సమకూర్చి.. ఇరాన్‌కు తరలిస్తున్నారు.

ఇరాన్‌లో రక్తసంబంధీకులు కానివారు అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉందని, అందుకే అక్కడికి తీసుకెళ్తున్నారని దర్యాప్తులో తేలింది. ఎవరి కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయిస్తున్నారు. అనంతరం 20 రోజులపాటు దాతను అపార్ట్‌మెంట్లో ఉంచి.. కోలుకున్న తర్వాత స్వస్థలానికి తరలిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు 20 లక్షల రూపాయలు వరకూ ఇస్తామని ఆశపెడుతున్నప్పటికీ ఖర్చులన్నీ చూపించి..6 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar