Womens commission: బండి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఆగ్రహం.. నోటీసులు జారీ

సంజయ్‌ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. సదరు వ్యాఖ్యలపై తక్షణమే విచారణ జరపాలని డీజీపికి ఆదేశించింది.

Womens commission: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మహిళల గౌరవాన్ని కించపరిచేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది.

బండి సంజయ్ ను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించనున్నట్టు తెలుస్తోంది. సంజయ్‌ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.

సదరు వ్యాఖ్యలపై తక్షణమే విచారణ జరపాలని డీజీపికి ఆదేశించింది.

 

సంజయ్ వ్యాఖ్యాలివే..(Womens commission)

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ స్కాం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకు హాజరయ్యారు.

ఈ మేరకు ఈడీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. ఈడీ నోటీసుల సందర్భంగా ప్రతిపక్ష నేతలు కవితను టార్గెట్‌ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కవితపై తీవ్ర విమర్శలు చేశారు. చట్టం ముందు అందరూ ఒక్కరే అని అన్నారు.

ఇక ఇదే సమయంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది.

కవితను అరెస్టు చేయకుండా.. ముద్దు పెట్టుకుంటారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు సంజయ్‌ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి ఉండి ఇలా ఓ మహిళపై కామెంట్స్‌ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యాఖ్యలకు నిరసనగా.. దిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దిష్టి బొమ్మను దహనం చేశారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

మరోవైపు కవిత ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆమెకు మద్దతుగాత తెలంగాణ లో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారాస శ్రేణులు, నేతలు పలు చోట్ల దిష్టి బొమ్మలు దహనం చేశారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో ఆందోళనకు దిగారు. వెంటనే సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని.. కవితకు క్షమాపణ చెప్పాలని భారాస కార్యకర్తలు డిమాండ్ చేశారు.

దిల్లీలో కవిత విచారణ, నగరంలో భారాస ఆందోళనల దృష్ట్యా నగరంలోని బషీర్‌బాగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయానికి తాళాలు వేసి.. పోలీసులు భారీగా మోహరించారు.