Hyderabad: ఎంపీ అరవింద్ ఇంటి పై జరిగిన దాడి పై మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ కవిత ఇంటి పై బీజేపీ వాళ్లు దాడి చేసినపుడు ఎక్కడికి పోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ అర్వింద్ ఇంటి విషయం పై గవర్నర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్పుడు మాట్లాడని గవర్నర్, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన నిలదీశారు. ఒక మహిళా ప్రజాప్రతినిధి పై దాడి చేసినా, గవర్నర్ స్పందించలేదని ఆమె వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
శుక్రవారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి పై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని ఖండించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అంతే కాకుండా ఘటన పై నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని గవర్నర్ ఆదేశించారు. ఇంట్లో వస్తువులను పగులగొట్టడం, కుటుంబ సభ్యులను బెదిరించడం చట్ట విరుద్ధమన్నారు. దీనిపై ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
తమ ఇంటి పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తల్లి విజయలక్ష్మీ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్‌కు చెందిన 50 మంది గూండాలు తమ ఇంటి పై దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి దిగడమే కాకుండా తనను బెదిరించారని విజయలక్ష్మిపేర్కొన్నారు. ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.