Site icon Prime9

Komatireddy Brothers: కోమటిరెడ్డి బ్రదర్స్ దారెటు?

Brothers

Brothers

Komatireddy Brothers: వ్రతం చెడ్డా ఫలితం దక్కని వైనంగా మారింది కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి. అటు తమ్ముడు ఓడిపోయాడు. ఇటు కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. మధ్యలో విజయాన్ని టీఆర్ఎస్ కాజేయడంతో ఈ బ్రదర్స్ కు ఇప్పుడు గడ్డు పరిస్థితే ఎదురైంది. ఎన్నో కుట్రలు కుతంత్రాలకు వేదికైన మునుగోడులో బీజేపీ తరుఫున పోటీచేసిన రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు కాంగ్రెస్ లో ఉన్న ఎంపీ వెంకటరెడ్డి చేయని ప్రయత్నం లేదంటారు.

ఫోన్ కాల్స్ చేస్తూ తమ్ముడిని గెలిపించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కాల్స్ కాకరేపాయి. కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించిన వెంకటరెడ్డి తీరు పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మునుగోడులో తమ్ముడు గెలవలేదు. కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతైంది. దీంతో ముఖ్యంగా రాజకీయాల్లో బలంగా ఉండి శాసించిన వెంకటరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు సమాధి పడుతుందా అన్న చర్చ సాగుతోంది. తమ్ముడి కోసం సొంత కాంగ్రెస్ నే కాలదన్నేలా కుట్రలు చేసిన వెంకటరెడ్డి రాజకీయాంగా చెడ్డ పేరు తెచ్చుకున్నారట. ఆయనను కాంగ్రెస్ వెలివేసే ప్రమాదం ఉంది. మొత్తంగా బ్యాడ్ అయిపోయి రాజకీయంగా ఎవరూ నమ్మని స్థితికి వెంకటరెడ్డి వెళ్లిపోయారా అన్న టాక్‌ వినిపిస్తోంది. అటు కాంగ్రెస్ లో భవిష్యత్ ఉండక ఇటు బీజేపీలో చేరుదామన్న పిలుపు రాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

మునుగోడులో అధర్మం గెలిచిందని ఆక్రోశం వెళ్లగక్కారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఆ పార్టీ నేతలు ప్రజల్ని బెదిరించారని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. అంతేకాదు ప్రజలను ప్రలోభాలకు గురి చేశారని ఆయన విమర్శించారు.ప్రజలు తనకే పట్టం కడతారని, ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు కావడంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి. ఎప్పుడు రాజకీయాలకు రాజీనామా చేస్తున్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక మునుగోడుతో తొడగొట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తను ఓడడమే కాదు. అన్నయ్య వెంకటరెడ్డి రాజకీయ భవిష్యత్ ను ఇరకాటంలో పెట్టేశారు. 18వేల కాంట్రాక్ట్ కోసమే ఆయన చేరారని టీఆర్ఎస్ చేసిన ప్రచారం కూడా ఆయన ఓటమికి దారితీసింది. ఇక బీజేపీ ఇస్తామన్న ఆ అతిపెద్ద కాంట్రాక్ట్ కూడా ఓటమితో ఇస్తారో లేదో, కాలమే తేల్చాలి.

ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ మునుగోడు రాజకీయంగా పెద్ద దెబ్బతీసిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం చూస్తున్న బీజేపీకి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల లాభం ఉంటుందా అన్న చర్చ మొదలైంది. ఫాంహౌస్ ఎపిసోడ్ కూడా బీజేపీని ఇరుకునపడేసింది. మొత్తంగా మునుగోడుతో ఇటు బీజేపీకి అటు కోమటిరెడ్డి బ్రదర్స్ కు తీవ్ర నష్టమే కలిగిందని చెబుతున్నారు పరిశీలకులు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తామే ఏ పార్టీకి అయినా కీలకం అన్న చందంగా వ్యవహరించిన బ్రదర్స్ కు ఇది భారీ దెబ్బగా భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే మాత్రం వీళ్లకు ఇంకా డిమాండ్ పెరిగి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. తాజా పరిణామాలు బ్రదర్స్ ఇద్దరికి ఇబ్బందులు సృష్టిస్తాయని చెపుతున్నారు. ఎందుకు అంటే మరో ఏడాదిలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. మొత్తానికి కాంగ్రెస్ దెబ్బ కొట్టాలని చూసి వీళ్లిద్దరు దెబ్బ తిన్నారు.

మొత్తం మీద చూస్తే, మునుగోడు ఎన్నికలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేలిపోయారు. ఇక ఆయన రాజకీయ భవిష్యత్ కష్టమేనని, ఆయన రిటైర్ మెంట్ ప్రకటించి వ్యాపారాలు చూసుకోవడం తప్ప రాజకీయాల్లో రాణించడం కష్టమేనంటున్నారు పరిశీలకులు. ఆయనను ఏ పార్టీ నమ్మే పరిస్థితి లేదంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ వేరే పార్టీల్లోకి వెళ్లే చాన్స్ లేదు. దీనితో రాజకీయంగా వీరి భవిష్యత్ గందరగోళంలో పడిందనే చెప్పాలి.

Exit mobile version