Hyderabad: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో హాస్పిటల్ దోపిడీని బయటపెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేస్తారు. చనిపోయిన వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడంటూ ట్రీట్‌మెంట్ చేసి బతికించాలని ఓ శవాన్ని డాక్టర్ల వద్దకు చిరంజీవి తీసుకెళ్తారు. ఇది తెలియని డాక్టర్లు శవానికి ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి డబ్బు గుంజాలని ప్రయత్నిస్తారు. చివరకి చిరంజీవి అతడి డెత్ సర్టిఫికెట్ చూపించడంతో అందరూ షాక్ అవుతారు. అచ్చం ఇలాంటి సీన్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిపీట్ అయింది.
తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ ప్రసవం కోసం ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆదివారం సాయంత్రం వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. ఈ విషయం చెప్పకుండా మెరుగైన చికిత్స అందించాలని అదే రోజు రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్లు ఆమెకు వైద్యం అందుతోందని, కోలుకుంటోందని చెప్పారు. కొద్దిసేపటి తరువాత తమ ప్రయత్నం ఫలించలేదని మృతి చెందిందని తెలిపారు. అనుమానం వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఆమనగల్లు ఆసుపత్రి వైద్యులు ఆమె కుటుంబానికి రూ.8 లక్షలు ఇస్తామని ఒప్పందపత్రం రాసిచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెడికల్ మాఫియా ఎలా రాజ్యమేలుతుందనేదానికి ఇదే పెద్ద ఉదాహరణ.